అలమేలు మంగమ్మా.. మన్నించు!
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో విజిలెన్స్ తనిఖీ కేంద్రంలోని సిబ్బంది నిబంధనలను తుంగలోకి తొక్కారు. భక్తులకు ఒక నిబంధన, సిబ్బంది మరో నిబంధన అన్నట్లుగా విధులు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అమ్మవారి దర్శనార్థం దేశ నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయ భద్రత దృష్ట్యా పెద్ద ఎత్తున విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా విధులను నిర్వహిస్తుంటారు. అయితే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులను తనిఖీ చేసే కేంద్రంలో సిబ్బంది తీరు చర్చనీయాశమైంది. ఆలయ మాడవీధుల్లో పాదరక్షలు ధరించి వెళ్లడం నిబంధనలకు విరుద్ధం. అలాంటి విజిలెన్స్ తనిఖీ కేంద్రంలో సిబ్బంది తమ పాదరక్షలను అక్కడే ఉంచి, విధులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. మంగళవారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది స్కానింగ్ సెంటర్ వద్ద వారి పాదరక్షలు ఉంచిన విషయం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఎంతో పరమపవిత్రంగా అమ్మవారి కొలుస్తున్న భక్తులను ఇలాంటి ఘటనలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఆలయ ఆవరణలో పాదరక్షలు, పవిత్రంగా భావించి క్యూలైన్ తనిఖీ కేంద్రంలో ఉంచడం మండిపడుతున్నారు.


