వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు
చిట్వేలి : మండలంలోని నేతివారిపల్లెలో ఆదివారం దివ్య(28) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వెంగయ్య తెలిపారు. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రాజపల్లెకు చెందిన దివ్యతో చిట్వేలి మండలం, నేతివారిపల్లికి చెందిన పసల సాయి పవన్ కల్యాణ్ (32)కు ఐదేళ్ల క్రితం వివామైంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. దివ్య హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తోంది. పవన్ కల్యాణ్ ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. దీనికితోడు ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ.4లక్షలు పోగొట్టుకుని, అప్పు చేయడంతో మనస్పర్థలు మరింత పెరిగాయి. అలాగే దివ్య నగలను సైతం పవన్ కల్యాణ్ అమ్మేయడంతో కాపురంలో ఘర్షణలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఇరువురూ నేతివారిపల్లెకు వచ్చేశారు. ఆదివారం సాయంత్రం పవన్ కల్యాణ్ ఫూటుగా మద్యం తాగి ఇంటికి రావడంతో దివ్య ఆవేదన చెందింది. భర్త వ్యవహారశైలిని వీడియో తీసి వాట్సాప్‌లో తల్లిదండ్రులకు పంపించింది. తర్వాత ఇంట్లో ఫ్యాను ఉరివేసుకుంది. కుటుంబీకులు వెంటనే రైల్వే కోడురులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న దివ్య తల్లిదండ్రులు సోమవారం నేతివారిపల్లెకు వచ్చారు. మంగళవారం చిట్వేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించామని ఏఎస్‌ఐ వెల్లడించారు.


