సనాతన ధర్మమే మార్గదర్శకం
తిరుపతి కల్చరల్: సనాతన ధర్మమే, సమాజ శ్రేయస్సు మార్గదర్శకమని, యావత్ జనావళి సనాతన ధర్మాన్ని పాటిస్తూ సమాజ సుభిక్షతకు తోడ్పడాలని కుర్తాళ సిద్ధేశ్వరీ పీఠాధిపతి, శ్రీశక్తిపీఠం వ్యవస్థాపకులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఉద్ఘాటించారు. శ్రీశక్తిపీఠం పీఠాధీశ్వరి రమ్యానంద భారతి 40వ జన్మదినం సందర్భంగా లోకకల్యాణాన్ని మహిళల సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో మంగళవారం సాయంత్రం 10 వేల మంది సీ్త్రమూర్తులతో దశ సహస్ర సుహాసినీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీస్వామి పాల్గొని, అనుగ్రహ భాషణం చేశారు. అనేక మంది యుగ పురుషులు తమ కార్యాలను దేశ సంక్షేమ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రమ్యానంద భారతి సనాతన ధర్మ పరిరక్షణకు సేవలు అందిస్తోందని తెలిపారు. ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో 10 వేల మంది మహిళలతో ఈ సుహాసినీ పూజ చేపట్టడం పరమేశ్వరుని ఆజ్ఞ అని పేర్కొన్నారు. శ్రీశక్తిపీఠాధీశురాలు రమ్యానంద భారతి మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువుల అనుగ్రహం ఉంటే ఏదైనా సుసాధ్యమవుతుందన్నారు. వేలాది మంది సీ్త్రమూర్తులతో సుహాసినీ పూజ చేపట్టడం మహద్భాగ్యమని తెలిపారు. దీనికి ముందుదశ సహస్ర సుహాసినీ పూజ అత్యంత వేడుకగా సాగింది. పూజా వేదికపై శ్రీమహాలక్ష్మి, శ్రీసరస్వతీదేవి, శ్రీకామాక్షి అమ్మవార్లను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం చేశారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సుహాసినీ పూజ అత్యంత భక్తిశ్రద్ధలలో సాగింది. కాగా ఒకే సారి 10 వేల మంది సీ్త్రమూర్తులతో ఏకకాలంలో చేపట్టిన సుహాసినీ పూజకు వరల్డ్ గిన్నీస్ బుక్‌లో స్థానం లభించింది. ఈమేరకు గిన్నిస్ బుక్ అధికారి స్వపనీల్‌ఽ ధ్రువీకరణ పత్రాన్ని పీఠాధీశ్వరి రమ్యానంద భారతికి అందజేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, డాక్టర్ వెంకట్రామన్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మహిళలు, శ్రీశక్తిపీఠం సభ్యులు పాల్గొన్నారు.


