కార్యకర్తల జోలికి వస్తే సీరియల్ చూపిస్తాం!
వెంకటగిరి(సైదాపురం): వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి, కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సినిమా కాదు.. సీరియల్ చూపిస్తానని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్‌జేఆర్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై రోజు రోజుకు కక్షసాధింపు చర్యలు అఽధికమవుతున్నాయని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటీవల వెంకటగిరి పట్టణంలోని చదువుకుంటున్న యువకుడితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, వారి కుటుంబ సభ్యులపై కూడా లేనిపోని సెక్షన్‌లతో తప్పుడు కేసులు పెట్టడం భావ్యం కాదన్నారు. అలాగే ఊర్లల్లో లేని వారి పై కూడా కేసులు బనాయించి వేదింపులకు గురిచేయడం సమంజసమా? అని ప్రశ్నించారు. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంటే రేపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే డిజిటల్ బుక్ అమల్లో ఉంటుందన్నారు. తమ కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జిల్లాల పునర్వభజన అసంబద్ధంగా చేశారని ఆరోపించారు. గూడూరు నియోజకవర్గాన్ని రెండు ముక్కలుగా చీల్చాలన్నారు. పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, జిల్లా సంయుక్త సహాయ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ విప్ పూజారి లక్ష్మి, వైస్ చైర్మన్ సేతరాసి బాలయ్య, కౌన్సిలర్లు ధనియాల రాధ, కందాటి కళ్యాణి, సుకన్య, ఆటంబాకం శ్రీనివాసులు, బాలాయపల్లి మండల అధ్యక్షులు వెందోటి కార్తీక్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు దశరథరామిరెడ్డి, కందాటి రాజారెడ్డి, పూజారి శ్రీనివాసులరెడ్డి, ఎం వెంకటేశ్వర్లు, అల్లం సాయి, సదానందరెడ్డి, వేణురెడ్డి, కల్లు సతీష్, రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


