ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో చేపట్టిన పలు ఇంజినీరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 5 వేల భజన మందిరాలు, నిర్మాణంలో ఉన్న ఆలయాలను, ఇటీవల కాలంలో అనుమతులు పొందిన ఆలయాలను సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఉపమాకలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కరీంనగర్‌లోని పద్మావతీ ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం, అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం, కుప్పంలో నిర్మించనున్న 141 ఆలయాలు, నవీ ముంబైలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ముంబైలోని భాంద్రా, కర్ణాటకలోని బెల్గావిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కొండగట్టు అంజన్న ఆలయం పరిధిలో అభివృద్ధి పనులు, కాణిపాకంలోని పీఏసీ తదితర సకాలంలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.


