కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక రూపొందించండి
● టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్
తిరుపతి అన్నమయ్యసర్కిల్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో అంతర్గత ఆడిట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కల్యాణ మండపాలు ఆదరణలో ఎన్ని ఉన్నాయి, లేనివి ఎన్ని, ఆధునీకరించినవి ఎన్ని, ప్రస్తుత స్థితిగతులు తదితర సమాచారం పూర్తిగా అందించాలన్నారు. అలాగే భక్తులు సౌకర్యవంతంగా వినియోగించుకోవడానికి సమగ్ర విధానాన్ని రూపొందించి, పాలక మండలికి నివేదించాలని తిరుపతి జేఈఓను ఆదేశించారు. టీటీడీ ఆలయాల్లోని తిరువాభరణ రిజిస్టర్లను డిజిటలైజ్ చేసి, డాక్యుమెంటను రూపొందించాలన్నారు. అలాగే అన్ని విభాగాల్లోని మౌలిక వసతులకు సంబంధించి టూల్స్ అండ్ ప్లానింగ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్‌ఏ అండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎర్రచందనం కేసులో
నలుగురికి ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్:ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో నలుగురికి ఐదేళ్ల వంతున జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పా రు. కోర్టు లైజనింగ్ అధికారి హరినాథ్, హెడ్ కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ కథనం మేరకు.. ఎర్ర వారిపాళెం పోలీసులకు అందిన సమాచారంతో 2018 ఫిబ్రవరి 24వ తేదీ ఎర్రవారి పాళెం మండలం, మాదరపల్లి సమీపంలోని అమ్మచెరువు గట్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చంద్రగిరి మండలం పట్టాభిరామపురానికి చెందిన భీమల శ్రీరాములు, చంద్రగిరి మండలం, రామిరెడ్డిగారిపల్లికి చెందిన పెండ్లి హరి, చిన్నగొట్టిగల్లు మండలం, బోడిరెడ్డిగారిపల్లికి చెందిన చుక్కల పాటి ఎర్రయ్య, చిన్నగొట్టిగల్లు మండలం, పాళెం గ్రామానికి చెందిన కానూరు శివ శేషాచలం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి నాలుగు దుంగలు తరలిస్తున్నట్టు గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నలుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నలుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ అమరనారాయణ వాదించారు.
ఫార్మేటివ్–3 పరీక్షలు ప్రారంభం
తిరుపతి సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్–3 పరీక్షలు సోమ వారం నుంచి ప్రారంభమైనట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,939 పాఠశాలల్లో పీఏ–3 పరీక్షలు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3,02,172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షల అనంతరం 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు.
కల్యాణ మండపాల నిర్వహణపై నివేదిక రూపొందించండి


