’డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ’కి 66 వినతులు
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 66 వినతులు అందినట్లు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. తిరుపతిలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు తమ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు, విద్యుత్ లైన్లు, ట్రాన్సఫార్మర్ల మార్పు, లో–ఓల్టేజ్ సమస్య, ట్రాన్సఫార్మర్ల సామర్థ్యం పెంపు, విద్యుత్ స్తంభాల మార్పు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తదితర సమస్యలున్నాయి. 66 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను తెలియజేయగా వాటిలో అనంతపురం జిల్లా నుంచి 25, తిరుపతి నుంచి 11, నెల్లూరు నుంచి 2, కర్నూలు నుంచి 2, కడప నుంచి 7, అన్నమయ్య నుంచి 5, నంద్యాల నుంచి 2, చిత్తూరు నుంచి 2, శ్రీసత్యసాయి సర్కిల్ నుంచి 10 వినతులు ఉన్నట్లు తెలిపారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె. రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు పీహెచ్. జానకీరామ్, జె. రమణాదేవి, ఎన్. శోభావాలెంటీనా, కె. ఆదిశేషయ్య, ఎం మురళీ కుమార్, ఎం ఉమాపతి, ఎం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


