ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
వెంకటగిరి రూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నట్లు అటవీశాఖ రేంజర్ కె బుజ్జిబాబు పేర్కొన్నారు. వెంకటగిరి రూరల్ మండలంలోని కొండక్రింద ప్రాంతాల్లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన మూడు ఎర్రచందనం మొద్దులు, ఒక దుంగను స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వెంకటగిరిలోని అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. వెలుగొండ కొండల పరిధిలోని డక్కిలి మండలం దేవుడువెల్లంపల్లి నుంచి వెంకటగిరి మండలం కుర్జాగుంట గ్రామం వరకు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీసీ కండ్రిగ నూతిగుంట ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం రవాణాకు సిద్ధం చేస్తుండగా దాడులు చేశారు. ఆ సమయంలో నలుగురిని అరెస్టు చేసి, మూడు మొద్దులు, ఒక ఎర్రచందనం దుంగను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. అరెస్టయిన వారిలో వెంకటగిరి రూరల్ మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన తూపిలి ఈశ్వరయ్య, బత్తల సుబ్రమణ్యం, వెంకటగిరి పట్టణం నెహ్రునగర్‌కు చెందిన అక్కల అశోక్, డక్కిలి మండలం శివగిరి గ్రామానికి చెందిన పుట్టం పోలయ్య అరెస్టు చేసినట్లు తెలిపారు. దాచెరువు గ్రామానికి చెందిన మురళి, శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి తిరుపతిలోని ఆర్‌ఎస్ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ సుమారు రూ.లక్ష ఉందటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వోలు ప్రతాప్‌రెడ్డి, విజయకుమార్, వరప్రసాద్, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


