అమరావతిలో పవిత్ర హారతులకు చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: అమరావతిలో పవిత్ర హారతులిచ్చేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక పరిపాలనా భవనంలోని తన చాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గంగానది తీరంలోని కాశీ, ఉజ్జయిని నిర్వహిస్తున్న పవిత్ర హారతులతోపాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఇస్తున్నారో టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి, నివేదిక రూపొందించాలని కోరారు. వేద మంత్రోచ్ఛారణలు, దీపాల కాంతులు, ఘంటానాదాల మధ్య పవిత్ర హారతి కార్యక్రమం భక్తులకు మరింత దైవనానుభూతిని పెంచుతుందని, టీటీడీ అధికారుల కమిటీ లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాలకు ఆయా చీఫ్ సెక్రటరీలకు ఉత్తరాలు రాశామన్నారు. గౌహతి, బెల్గాంలో భూ కేటాయింపులపై సంబంధిత అధికారులతో చర్చించాలన్నారు. జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ, ఎఫ్‌ఏఅండ్ సీఏఓ బాలాజీ, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు.


