సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే
తిరుపతి తుడా: దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని తిరుపతి ఎంపీ డాక్టర్ ఎం గురుమూర్తి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కొనియాడారు. శనివారం మహిళా వర్సిటీ సమీపంలో బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని, మాట్లాడారు. 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజుల్లో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మహిళా సాధికారిత కోసం కృషి చేశారన్నారు. సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే సీ్త్ర విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మ హిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సా మాజిక బాధ్యతగా ఆమె విశ్వసించారని చెప్పారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారని కొనాయాడారు. పూలే ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేసిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ సంకల్పానికి తానే ఉదాహరణ కావడం, తనకు లభించిన గౌరవమని మేయర్ శిరిషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


