యువకుడి గుండెతో యువతికి పునర్జన్మ
తిరుపతి తుడా: ఓ యువకుడి గుండెను యువతికి విజయవంతంగా అమర్చి పునర్జన్మను ప్రసాదించారు. టీటీడీ శ్రీపద్మావతి కిడ్స్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో శనివారం 23వ గుండె మార్పిడిని వైద్యులు విజయవంతం చేశారు. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయినా 15 ఏళ్ల యువకుడి గుండెను కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతీకి గుండెను అమర్చారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు ఐదు గంటల పాటు శ్రమించి, గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
ఐదు గంటల పాటు శ్రమించిన వైద్యులు
డిసెంబర్ 31న కర్నూలు రింగ్ రోడ్డు వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా అవయవ దానానికి ముందుకు వచ్చారు. యువకుడి అవయవాల వివరాలను అవయవదాన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయించారు. కృష్ణా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి ప్రసవానంతర కార్డియోమయోపతి, గుండె వైఫల్యం సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. ఇటీవల ఆమె తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో వైద్యం కోసం వచ్చారు. గుండె పూర్తిగా వైఫల్యం చెందిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు తేల్చారు. ఈ క్రమంలో గుండె అవసరాన్ని ఆస్పత్రి వైద్యులు అవయవ దాన్‌లో నమోదు చేశారు. కర్నూలు యువకుడి గుండె అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తించిన ఇక్కడి వైద్యులు సమాచారం అందించారు. పద్మావతి వైద్యుల బృందం కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి యువకుడి గుండెను సేకరించి, తిరుపతికి తీసుకువచ్చారు. ఐదు గంటలపాటు శ్రమించిన వైద్యుల బృందం యువతికి విజయవంతంగా గుండెను అమర్చారు.
గ్రీన్ ఛానల్ ద్వారా తరలింపు
సాయంత్రం నాలుగు గంటలకు కర్నూలు విమానాశ్రయంలో ప్రత్యేక విమానం టేకాఫ్ కాగా 4.15 గంటల కల్లా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసుల సహకారంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి 25 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. 1.15 గంటల్లో ఆస్పత్రి కి గుండె విజయవంతంగా చేర్చారు. అనంతరం వైద్యులు యువతికి గుండె మార్పిడి చేశారు.


