
నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
తిరుపతి కల్చరల్:బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బిడ్డ వైద్యం కోసం దాతలు ఆర్థిక సాయం చేసి, తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని చిన్నారి తల్లిదండ్రులు చెంగమ్మ, దేశయ్య మీడియా ముందు వేడుకున్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణవనం మండలం, నాగిలేరు గ్రామం యానాదిసెంటర్‌లో కాపురముండే తాము నిత్యం కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నామన్నారు. అయితే తన కుమారుడు మురళి(8)కు తీవ్ర జ్వరంతో అనారోగ్యం బారిన పడడంతో రుయా ఆస్పత్రిలో చికిత్స చేయించామని తెలిపారు. అయితే తన బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించిన వైద్యులు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సకు రెఫర్ చేశారని తెలిపారు. స్విమ్స్‌లో తమ బిడ్డను పరీక్షించిన వైద్యులు బాబుకు టెస్ట్ చేయించాలని, అందుకు రూ.40వేలు ఖర్చు అవుతుందని, అంతేకాక బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యేందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు పెట్టాలని వైద్యులు సూచించారని వాపోయారు. రోజువారీ కూలీ చేస్తే కాని బతుకు సాగని తమకు అంత డబ్బులు పెట్టి బిడ్డకు వైద్య చేయించే స్తోమత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు స్పందించి తగిన ఆర్థిక సాయం అందించి, తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని కన్నీటి పర్యవంతమయ్యారు. సాయం అందించే దాతలు తమ ఫోన్ నంబర్ 7780253548ను సంప్రదించి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.