
మోసం బాబు నైజం
● చంద్రగిరిలో ‘బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ’
● జగనన్న హయాంలో సంక్షేమం..
బాబు పాలనలో సంక్షోభం
● అక్రమ అరెస్టులతో చెవిరెడ్డిని భయపెట్టలేరు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి రూరల్ : జగనన్న పాలనలో ప్రజలకు సంక్షేమం అందింది.. బాబు ప్రభుత్వంలో సంక్షోభం మిగిలింది.. సూపర్ సిక్స్ పథకాలను అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు.. ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు.. తుస్సు మనిపించారు.. ఇదిగో అమ్మకు వందనం అన్నారు.. ఎవరికీ అందకుండా చేశారు.. ఆడబిడ్డ నిధి అన్నారు.. ఆ పథకాన్ని ఆమడదూరం చేసేశారు.. నిరుద్యోగులకు శఠగోపం పెట్టారు.. ఉద్యోగుల హామీలను గాలికి వదిలేశారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారు.’ అంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో గురువారం ‘బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని భూమన చేతులు మీదుగా ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో బాబు చేసిన మోసాలతో పాటు చెవిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కక్ష సాధింపు చర్యలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడానికి ప్రతిపక్షంపై నిందలు వేయడం బాబుకు వెన్నతోపెట్టిన విద్య అని భూమన విమర్శించారు. బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు మోసాన్ని ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అప్పుడే చంద్రబాబు మళ్లీ మోసం చేశారన్న నిజం ప్రజలకు తెలుస్తుందన్నారు.
అండగా నిలబడ్డ వారందరినీ గుర్తు పెట్టుకుంటా
చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి కష్టం వస్తే ఆ కుటుంబానికి మేమున్నామని అండగా నిలబడి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటా.. రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ చేయగలిగినంత సాయం చేసి రుణం తీర్చుకుంటానని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట ఇవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రగిరి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా.. ఏ మాత్రం భయపడకుండా తమకు అండగా నిలిచి అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనలు చేయడం చూస్తుంటే పార్టీ శ్రేణుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమనిపిస్తోందన్నారు. జగనన్న ఆదేశాలు మేరకు పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తమ గ్రామాల్లోకి వెళ్లి బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం చేసిన మోసం, చెప్పిన అబద్ధాలను వివరించాలన్నారు. అంతేకాక ఆ నాడు ఏం చెప్పారన్న విషయాలు అందరికీ తెలిసేలా బాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ ఆ కుటుంబం ఎంత నష్టపోయారో వివరించాలన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పి అందలమెక్కిన చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు చొక్కా పట్టుకుని అడగాలని సూచించారు. అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, ఆరు మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీనియర్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా నేతలు పాల్గొన్నారు.
కట్టుకథలు అల్లి అక్రమ కేసులు
జగనన్నకు అతి దగ్గరగా ఉన్నందునే తన తమ్ముడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలులో 44 రోజులుగా బధించారని, అదే కేసులో భాస్కర్ బిడ్డ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని కూడా ఇరికించడం దుర్మార్గమన్నారు. ఇలాంటి విషయాలు పచ్చ పత్రికలు ముందే రాస్తాయని, ఎల్లో మీడియా ఓ కట్టు కథను అల్లుతాయని.. పోలీసుల ఆ కథను క్రైంగా అమలు చేస్తున్నారని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పాతికేళ్లు నిండిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని జైలుకు పంపాలని ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అంతా ఇంతా కాదని, అయితే ఏ తప్పు చేయకుండా జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుండగా అక్రమంగా జైలుకు పంపిన వారి జీవితాలు మాత్రం పతనం కాక తప్పవని హెచ్చరించారు. గతంలో సోనియాగాంధీ, చంద్ర బాబు ఇద్దరు కుట్రలు చేసి వైఎస్ జగన్‌పై 18 రకాల కేసులు పెట్టి 18 నెలల పాటు జైలులో బంధిస్తే, ఆ తరువాత బయటకు వచ్చిన జగన్ విక్రమార్కుడిలా దూసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మళ్లీ జగన్‌ను జైలుకు పంపుతుందని.. అందులో భాగమే ఆయన చుట్టూ ఉన్న వారిని అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. చంద్రబాబు మోసాలు, చెవిరెడ్డి కుటుంబంపై ఆయన ప్రభుత్వం చేస్తున్న కుట్రలను చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్ తీసుకోవాలని సూచించారు.

మోసం బాబు నైజం