
వసతి గృహాలు దారుణం
● డీఆర్‌ఓకువైఎస్సాఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతల వినతి
తిరుపతి రూరల్ : జిల్లాలోని బాల, బాలికల ప్రభుత్వ వసతి గృహాలు దారుణంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఓబుల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా పలు ప్రభుత్వ, సంక్షేమ వసతిగృహాలను సందర్శించిన అనంతరం సమస్యల ప్రతిని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి నర్సింహులును కలిసి అందజేశారు. అనంతరం విద్యార్థి నాయకులతో కలసి ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లాలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను పరిశీలించామని తెలిపారు. ప్రభుత్వం పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా మరుగుదొడ్లు, బాత్ రూములు నిర్మించాలని డిమాండు చేశారు. అలాగే వసతి గృహాల్లోని విద్యార్థులందరికీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ప్రతీ హాస్టల్లోనూ పిల్లలకు బెడ్స్, ప్లేట్లు, దుప్పట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు అందించాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వసతిగృహాలలో సిబ్బందిని నియమించి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యవర్గ, నియోజకవర్గ, యూనివర్సిటీ, మండల అధ్యక్షుడు భాను ప్రకాశ్ రెడ్డి, దినేష్ రెడ్డి, చంగల్ రెడ్డి, ప్రేమ్ కుమార్, జస్వంత్ కుమార్ రెడ్డి, మహమ్మద్ రఫీ, యశ్వంత్ కుమార్ రెడ్డి, హరిబాబు, ముని, వినోద్ కుమార్, ప్రదీప్ కుమార్, పార్థసారథి, శేషారెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.