
అక్రమ స్కానింగ్ పార్ట్–2!
చేతులు మారిన
స్కానింగ్ మిషన్!
కాణిపాకం: చిత్తూరులోని భరత్‌నగర్‌లో మూడు నెలలక క్రితం అక్రమ స్కానింగ్ సెంటర్‌ను కలెక్టర్ సుమిత్‌కుమార్ సీజ్ చేశారు. ఇక్కడ దొరికిన స్కానింగ్ మిషన్‌ను విచారణ అనంతరంకలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అప్పగించారు. ఈ మిషన్ కంపెనీ ఆధారంగా తమిళనాడు నుంచి బయటకు వచ్చినట్లు తెలుసుకున్నారు. ముఠా సభ్యులు స్కానింగ్ మిషన్‌ను ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారో తెలుసుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా స్కానింగ్ మిషన్ 16 మంది చేతులు మారినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు.
కాణిపాకం/తిరుపతి తుడా: మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్ బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో చిత్తూరు కలెక్టర్ పట్టుకున్న అక్రమ స్కానింగ్ వ్యవహారం పార్ట్–2 కథను తలపిస్తోంది. చిత్తూరులో గుట్టు రట్టు కావడంతో ఈ ముఠా తిరుపతికి మక్కాం మార్చింది. అక్కడ అక్రమ స్కానింగ్‌ను గుట్టుగా నడిపించింది. వీరిచ్చిన తప్పుడు రిపోర్టుతో ఓ గర్భిణి, గర్భిణి కుమార్తెను బలితీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ముఠాను అరెస్ట్ చేసి... భవానీ నగర్‌లోని అక్రమ స్కానింగ్, ఓ ప్రైవేటు ఆస్పత్రిని సీజ్ చేశారని రెండు జిల్లా అధికారులు వెల్లడించారు. ఇందులో చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న ఓ సిబ్బంది పాత్ర కీలకమని తెలిసింది. దీనిపై చిత్తూరు కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ సుమిత్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, వన్‌టౌన్ పోలీసులు చర్చించినట్లు సమాచారం.
గర్భిణితో పాటు ఆడ బిడ్డను చంపేశారు!
వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైకి చెందిన ఓ గర్భిణికి తొలి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. రెండో సారి గర్భవతి కావడంతో ఆగర్భిణి ముఠా వలలో పడింది. నెల కిందట తిరుపతికి వచ్చింది. స్కానింగ్ చేయించుకుని కడుపులో ఉన్నది ఆడ బిడ్డగా తెలుసుకుంది. ఇంటికెళ్లి అబార్షన్ చేయించుకుంటానని పట్టుపట్టింది. కుటుంబీకులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో కుమార్తెతో పాటు ఆ గర్భిణి బావిలో దూకి చనిపోయింది. దీనిపై భర్త ఇచ్చిన ఫిర్యాదుతో తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. గర్భిణి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా..క డుపులో ఉన్నది మగబిడ్డగా నిర్థారణ అయ్యింది. దీంతో అక్రమ స్కానింగ్ సెంటర్‌పై అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చిత్తూరు సిబ్బందిదే కీలక పాత్ర
చిత్తూరులో పట్టుబడ్డ అక్రమస్కానింగ్ ముఠా సభ్యులే.. ఈ గర్భిణి మృతికి కూడా కారణమని తమిళనాడు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. వీళ్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముఠాకు .గుడిపాల మండలంలో పనిచేసే ఓ అటెండర్ (డీఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది) ముందుండి నడిపిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతనిని కూడా తమిళనాడు పోలీసులు రిమాండ్‌కు తరలించగా.. అతను మూడు రోజుల క్రితమే బయటకు వచ్చినట్లు కార్యాలయమంతా గుసగుసలు మొదలయ్యాయి. ఇతనే ముఠాకు స్కానింగ్ మిషన్లను కొనుగోలు చేసి ఇచ్చినట్లు చిత్తూరు శాఖలో చర్చ సాగుతోంది. ఇతనితో పాటు జీడీనెల్లూరుకు చెందిన ఓ ఆశా వర్కర్, పాలసముద్రంకు చెందిన ఓ ఏఎన్‌ఎం పాత్ర కూడా ఉందని చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖలో చర్చించుకుంటున్నారు. అయినా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. ఈ మేరకు పోలీసులు చిత్తూరు కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓతో చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు ఆశావర్కర్‌పై రెండు రోజుల్లో చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా తిరుపతి భవానీ నగర్‌లో నడిపిస్తున్న స్కానింగ్ సెంటర్‌ను తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు ఒక మెటర్నిటీ ఆస్పత్రిని కూడా సీజ్ చేశామని తిరుపతి డీఎఅండ్‌హెచ్‌ఓ తెలిపారు.
మళ్లీ తెరపైకి అక్రమ స్కానింగ్
చిత్తూరు కలెక్టర్ పట్టుకున్న అక్రమ స్కానింగ్‌లో ఇది పార్ట్–2 చిత్తూరులో గుట్టురట్టు కావడంతో తిరుపతిలో ముఠా మక్కాం ఓ క్లినిక్ అడ్డాగా లింగనిర్థారణ
తప్పుడు నిర్థారణతో తమిళనాడుకు చెందిన గర్భిణితోపాటు కుమార్తె ఆత్మహత్య!
భర్త ఫిర్యాదుతో కేసు నమోదు!
అక్రమ స్కానింగ్ ఇలా..
మూడు నెలలకు క్రితం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ చిత్తూరు నగరంలోని భరత్‌నగర్‌లో అక్రమ స్కానింగ్ సెంటర్ నిర్వహణ ముఠాను.. రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. 22 మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా దీని పార్ట్–2 కథ బయటకు వచ్చింది. చిత్తూరులో పట్టుబడ్డ ముఠానే మళ్లీ తిరుపతి భవానీ నగర్‌లో అక్రమ స్కానింగ్‌ను ఏర్పాటు చేసుకుని లింగనిర్థారణను కొనసాగిస్తూ వచ్చింది. దీనిపై చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు అక్రమ స్కానింగ్ సెంటర్‌పై వారు నిఘా పెట్టారు. తమిళనాడు నుంచి గర్భిణులను తీసుకొచ్చి తిరుపతిలో లింగనిర్థారణ చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారని గుర్తించారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి ఫీజుగా రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు గుంజుకుంటున్నారని తెలుసుకున్నారు. వీళ్ల నిర్థారణలో ఓ గర్భిణికి ఇచ్చిన రిపోర్టు తప్పు అని తేలడంతో వీళ్ల బండారం మొత్తం బయటపడింది.