
ఎంఈఓల నియామకంపై ఉపాధ్యాయుల నిరసన
తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సీనియారిటీని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఎంఈఓ–1ను నియమించడం దారుణమని ఏపీ ఉపాధ్యాయ సంఘం (అపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుచానూరు ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో అపస్ నేతలు, ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి సర్వీస్ నిబంధనల అమలు కోసం ప్రత్యేక కమిటీ ద్వారా నియామకాల విషయంపై ఉపాధ్యాయ సంఘాలు ప్రయత్నిస్తున్న తరుణంలో మండల విద్యాశాఖ అధికారి–1గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇవ్వడం దారుణమన్నారు. ఎంఈఓ పోస్టులను కేవలం ప్రభుత్వ పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అవమానపరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌కు సంబంధించి కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని హితవు పలికారు. శుక్రవారం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అలాగే భోజన విరామ సమయంలో ప్రతి పాఠశాలలో నిరసనలు తెలపాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన ఎంఈఓ–1 పోస్టులను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణపై ఉపాధ్యాయులతో చర్చించి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో అపస్ రాష్ట్ర కార్యదర్శి గజ్జల వెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు