
ప్రజాభిమానం ఓర్వలేక ఆంక్షలు
వెంకటగిరి(సైదాపురం) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు చూపుతున్న ఆదరణను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్ సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా వెంకటగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో నెల్లూరు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం జగన్ పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధించడం తగదన్నారు. ముళ్ల కంచెలు వేయడం, రోడ్లకు అడ్డంగా గోతులు తవ్వడం, ప్రజలపై లాఠీచార్జీ చేయడం వంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. జగన్‌ను చూసేందుకు వచ్చే వారిని అడ్డుకోవాలంటే అరచేతితో సూర్యుడిని ఆపాలనుకోవడమేనని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వెంకటగిరి పట్టణ కన్వీనర్ పులి ప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనర్ కాల్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సైదాపురం మండల కన్వీనర్ ఎం.రవికుమార్, బాలయపల్లి మండల కన్వీనర్ వెందోటి కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నేతలు, అభిమానులు నెల్లూరుకు తరలివెళ్లారు.