ఫలించిన చర్చలు.. దీక్ష విరమణ
తిరుపతి రూరల్ : ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సుమారు 16 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేపట్టిన విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో ఉన్నతాధికారుల చర్చలు బుధవారం ఫలించాయి. సీఎండీ సమక్షంలో జరిగిన చర్చల వివరాలను మినిట్స్ రూపంలో రాత పూర్వకంగా హెచ్‌ఆర్ డైరెక్టర్ లక్ష్మీనరసయ్య, డీజీఎంలు మూర్తి, సురేంద్ర, ప్రసాద్ తదితరుల దీక్షా శిబిరం వద్ద కార్మికులకు అందించారు. అనంతరం కార్మిక సంఘం నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. హెచ్‌ఆర్ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని, ఇతర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వేతనాల పెంపు, పీఆర్ అరియర్స్ తదితర అంశాలను హెచ్‌ఆర్ కమిటీలో అజెండాగా చేరుస్తామని తెలిపారు. సీపీఎం నేత కందారపు మురళి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నేత శివప్రసాద్ రెడ్డి, కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షుడు కొండయ్య, అనంతపురం జిల్లా నేతలు నూర్ బాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవికుమార్, పుత్తూరు కార్యదర్శి మురళి పాల్గొన్నారు.


