విశ్వసనీయతే ‘సాక్షి’ పునాది..

YS Bharathi Reddy Participated In Sakshi 15th Annual Celebrations

వై.ఎస్‌. భారతీరెడ్డి 

జనహితంగా కథనాలు ఉండాలి 

పాత్రికేయ ప్రమాణాలు పాటించాలి 

ఘనంగా ‘సాక్షి’ 15వ వార్షిక వేడుకలు   

సాక్షి, హైదరాబాద్‌: నాణేనికి మరో కోణాన్ని చూపించి, ‘సత్యమేవ జయతే’ నానుడిని సాకారం చేయాలనే లక్ష్యంతో విశ్వసనీయత పునాదిగా పుట్టిన ‘సాక్షి’.. అదే బాటలో తన ప్రస్థానం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సాక్షి దినపత్రిక 15వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. 

ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని విశ్లేషించుకోవడానికి, భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి వార్షి కోత్సవాలు వేదిక కావాలన్నారు. కచ్చితత్వంతో కూడిన సమాచారం ఆధారంగా కథనాలు అందించేటప్పుడు తప్పనిసరిగా అవతలి వ్యక్తుల వివరణ తీసుకోవడం వంటి స్వచ్ఛతతో కూడిన పాత్రికేయ ప్రమాణాలు పాటించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వెనుకంజ వేయనవసరం లేదన్నారు. పాఠకులకు సులభంగా చేరేలా, జనహితంగా కథనాలు సాగాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, సీఈఓ అనురాగ్‌ అగర్వాల్, డైరెక్టర్లు రాణిరెడ్డి, వైఈపీ రెడ్డి, కేఆర్‌పీ రెడ్డి, ఏఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కేన్సర్‌ బాధిత చిన్నారులతో..
‘సాక్షి’ వార్షిక వేడుకల్లో భాగంగా వై.ఎస్‌.భారతీరెడ్డి కేన్సర్‌ బాధిత చిన్నారులను కలసి ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తమ బాధలను మరచిపోయిన చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌కేర్‌ సెంటర్‌ ద్వారా కేన్సర్‌కు ఉచితంగా చికిత్స పొందుతున్న చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top