World Heritage Day 2022: హైదరాబాద్‌లో హష్మత్‌గంజ్‌ గేటు.. పట్టించుకోపోతే అంతే!

World Heritage Day 2022: Some Of The Famous Heritage Sites In Hyderabad - Sakshi

ద్వారమిక్కడ.. భవనమెక్కడ!

ప్యాలెస్‌ నుంచి విడిపోయి ఏకాకిగా మారిన హైదరాబాద్‌ బ్రిటిష్‌ రెసిడెన్సీ ప్రవేశద్వారం 

ఆలనాపాలనా లేక శిథిలావస్థలో 217 ఏళ్లనాటి గేటు

నేడు వరల్డ్‌ హెరిటేజ్‌ డే

సాక్షి, హైదరాబాద్‌: ఇదో గేటు.. ఓ రాజప్రాసాదం ప్రవేశ ద్వారం. దీని వయసు దాదాపు 217 ఏళ్లు. బ్రిటిష్‌ పాలకులు నిర్మించారు. అందుకే దీని శిఖర భాగంలో ఇప్పటికీ రెండు సింహాలతో కూడిన నాటి ఈస్టిండియా కంపెనీ చిహ్నం కనిపిస్తుంది. కానీ ఈ గేటు ఇప్పుడు తప్పిపోయింది. భవనమెక్కడో.. ఈ ద్వారమెక్కడో అన్నట్టు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. ఇలా ఒంటరిగా ఇరుకు సందుల్లో ఇరికిపోయింది. వందల ఏళ్లనాటి డంగుసున్నపు నిర్మాణం కావటంతో పట్టించుకునేవారు లేకున్నా పటిష్టంగా నిలిచి ఉంది. కానీ మరమ్మతులు చేయకపోతే మాత్రం ఇక నిలవలేనంటోంది. దీన్ని హష్మత్‌గంజ్‌ గేటు అని పిలుస్తారు.  

ఎందుకు తప్పిపోయింది.. ఏంటా కథ 
హైదరాబాద్‌కు ఐదో రెసిడెంట్‌గా వ్యవహరించిన కిర్క్‌ పాట్రిక్‌ 1805లో బ్రిటిష్‌ రెసిడెంట్‌ కోసం రాజప్రాసాదం నిర్మించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌ శైలితో అచ్చుగుద్దినట్టు అదే డిజైన్‌తో, అదే సమయంలో ఈ రెసిడెన్సీ నిర్మితమైంది. ప్రస్తుతం దీన్ని కోఠి మహిళా కళాశాలగా పిలుస్తున్నారు. ఈ రెసిడెన్సీకి వివిధ మార్గాల్లో ద్వారాలు నిర్మించారు. ప్రస్తుతం సుల్తాన్‌బజార్‌–బడీచౌడి మార్గంలో ఉన్న హష్మత్‌గంజ్‌ గేటు కూడా వీటిల్లో ఓ ద్వారం. అప్పట్లో రెసిడెన్సీ చుట్టూ చిన్న ప్రహరీ తప్ప పెద్ద కోటగోడ లేదు.

1857తో తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్‌ రెసిడెన్సీపై దాడి జరగడంతో చుట్టూ భారీ గోడ నిర్మించారు. ప్రస్తుత ఆంధ్రాబ్యాంకు ప్రధాన రహదారిని 1950 ప్రాంతాల్లో నిర్మించారు. ఆ సమయంలో మధ్యలో దారి రావడంతో భవనానికి, ఈ ద్వారానికి మధ్య అనుంబంధం తెగిపోయింది. ఆ తర్వాత భవనంలో మహిళా కళాశాల ఏర్పాటు చేశారు. దీని బాగోగులను ఉస్మానియా విశ్వవిద్యాలయం, పురావస్తు శాఖలు చేపడుతూ రాగా క్రమంగా ఈ గేటు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధీనంలోకి వెళ్లిపోయింది. ఇక ఆలనాపాలనా నిలిచిపోయింది.  

భారీగా నిధులొచ్చినా..
వరల్డ్‌ మాన్యుమెంట్‌ ఫండ్‌ నుంచి రూ. కోట్ల నిధు లు రావటంతో రెసిడెన్సీ భవనంలోని ప్రధాన దర్బార్‌ హాలుతో పాటు మరికొన్ని భాగాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి పునర్‌ వైభవం కల్పించా రు. కానీ ఆ భవనంలో భాగంగా నిర్మితమైన ఈ ద్వారానికి నయా పైసా కేటాయించలేదు. బడీచౌడి రోడ్డులోని చిరు వ్యాపారులు ఈ ద్వారం గోడలకు మేకులు దింపి వస్తువులు తగిలించుకోవడానికి వాడుతున్నారు. పట్టించుకునేవారు లేక ఈ కట్టడం క్రమంగా శిథిలమవుతోంది. 

పట్టించుకుంటే.. పర్యాటక ప్రదేశమవుతుంది
ఈ ద్వారం ఎంతో ప్రత్యేకమైంది. దీని చుట్టూ నిర్మాణాలు తొలగించి గేటును విడిగా చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. లైటింగ్‌ బిగించి కట్టడం వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తే అద్భుత పర్యాటక ప్రదేశమవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
– తురగ వసంత శోభ, కన్జర్వేషన్‌ ఆర్కిటెక్ట్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top