పెళ్లైన 23 ఏళ్లకు తల్లి అయ్యింది.. అంతలోనే ప్రాణాలొదిలింది

A woman who gave birth to two children and deceased after 15days - Sakshi

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి 15 రోజులకు ప్రాణాలు వదిలిన మహిళ 

కోరుట్ల: పెళ్లి అయిన 23 ఏళ్లకు మాతృత్వపు ఆశలు తీరినా 15 రోజులకే అవి ఆవిరయ్యాయి. ఇద్దరు మగశిశువులకు జన్మనిచ్చి కన్నుమూసింది ఓ తల్లి. తనివితీరా బిడ్డలను చూసుకోకముందే తనువు చాలించింది.  జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్‌కు చెందిన పొన్నం స్వరూప (42), అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ దంపతులు. పెళ్లి అయి 23 ఏళ్లు అయినా వారికి సంతానంలేదు. సంతానం కోసం ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఆ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ కోసం ప్రయత్నించారు.

ఈ ప్రయత్నం ఫలించి పది నెలల క్రితం స్వరూప గర్భం దాల్చింది. జూలై 19న ఆమె మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్ద రు మగ శిశువులకు జన్మనిచ్చింది. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే వారిద్దరినీ అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలో మెట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్వరూప మూడు రోజుల క్రితం పిల్లలను చూసేందుకు హైదరాబాద్‌ వెళ్లింది. తన పిల్లలతో ఆనందంగా గడపకముందే ఇన్ఫెక్షన్‌తో అనారోగ్యం పాలైంది. హైదరాబాద్‌లోనే మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top