Hyderabad: ఐటీ కారిడార్‌లో దారుణం.. మీద నీళ్లు చల్లినందుకు సారీ చెప్పాలని అడిగితే.

Woman Died After Car Hits Her With Rash Driving At Gachibowli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీద నీళ్లు చల్లినందుకు సారీ చెప్పాలని కోరిన ఇద్దరు యువకులను బెంజ్‌కారుతో ఢీకొట్టాడు మరో యువకుడు. తమ వారిపై అలా ఎలా ప్రవర్తిస్తావని అడిగేందుకు బైకుపై వెళ్లిన దంపతులను కూడా బెంజ్‌ కారుతో ఢీ కొట్టాడు. సారీ చెప్పేందుకు ఇష్టపడని యువకుని ఇగో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో ఎగిరి కిందపడ్డ ఓ యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

ఎర్రగడ్డకు చెందిన దంపతులు సయ్యద్‌ సయీఫుద్దీన్‌ జావీద్, మరియా మీర్‌(25) ఒక బైక్‌పై, జావీద్‌ సోదరులు సయ్యద్‌  మినాజుద్దీన్, రషద్‌ మిష్బా ఉద్దీన్‌లు ఒక బైక్‌పై ఈ నెల 17 రాత్రి కేబుల్‌ బ్రిడ్జి చూసేందుకు మాదాపూర్‌ వచ్చారు. కేబుల్‌ చూసిన తరువాత 18న అర్థరాత్రి 1 గంట సమయంలో ఫుడ్‌ కోసం గచ్చిబౌలి వైపు వచ్చారు. తిరిగి వెళుతుండగా పక్కనుంచి వెళ్లిన బెంజ్‌ కారు నుంచి నీళ్లు మీదపడ్డాయి. దీంతో బైక్‌పై ఉన్న మినాజుద్దీన్, రషీద్‌లు కారును వెంబడించి నీళ్లు పోసి..సారీ చెప్పకుండా వెళుతున్నావని అడిగారు. దీంతో కారు డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న వ్యక్తి వీరిని దుర్భాషలాడుతూ బెంజ్‌ కారు ఢీ కొట్టడంతో ఇద్దరు కిందపడి పోయారు.

దీనిని గమనించిన సయీఫుద్దీన్‌ బైక్‌పై కారును వెంబడించగా...వీరి బైకును కూ డా గచ్చిబౌలోని అట్రియం మాల్‌ వద్ద ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న మరియా మీర్‌ ఎగిరి కింద పడటంతో తలకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. మృతురాలికి 8 నెలల కూతురు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంజ్‌ కారు నడిపిన యువకుడు రెండు సార్లు కారుతో ఢీ కొట్టాడని చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

సీసీ పుటేజీలను పరిశీలించగా ఒకసారి బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు కింద పడ్డారని, మరో బైక్‌ను ఢీ కొట్టడంతో మరియా మీర్, సయీఫుద్దీన్‌లు ఎగిరి పడ్డట్లు గుర్తించారు. కారులో ప్రయాణించిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొడుకు రాజసింహారెడ్డిగా గుర్తించి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కారును సీజ్‌చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top