సినీ గ్లామరే కాదు.. గ్రామర్‌ ఉండాలి: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu Comments On Movies Politics At Book Opening Ceremony - Sakshi

‘శక్తిమంతమైన ప్రచార, ప్రసార మాధ్యమం సినిమా. అలాగే, నేటికీ ప్రజలకు అత్యంత చౌకగా వినోదం అందించే సాధనమూ సినిమా. కానీ, నేటి సినిమాల్లో ఎక్కువగా గ్లామర్, అక్కడక్కడా హ్యూమర్‌ నిండి, అసలైన గ్రామర్‌ (చెప్పుకోదగ్గ విషయం) తక్కువగా ఉంటోంది. ఒకప్పటి సినిమాల్లా వినోదంతో పాటు, విజ్ఞానం, ఎంతో కొంత సందేశం ఉండేలా చూసుకోవడం సినీరంగం బాధ్యత’’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్‌ కిశోర్‌ రూపొందించిన ‘స్వాతంత్య్రోద్యమం–తెలుగు సినిమా–ప్రముఖులు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు.

సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ‘స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న పాత తరం సినీ ప్రముఖులపై ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ‘వరకట్నం, సతీసహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంచి ఇతివృత్తాలతో, సంభాషణలతో వచ్చిన సినిమాలు గతంలో విజయవంతమయ్యాయయని గుర్తు చేశారు.. అలాంటి మంచి సినిమాలు తీస్తే ఆడవనే మాట తప్పని ఆయన విశ్లేషించారు. ‘నేటి తరం గురువును మర్చిపోయి, గూగుల్‌ను చూస్తోందని.. గూగుల్‌ పాడైతే, దాన్ని బాగుచేయడానికి సాంకేతిక నిపుణుడనే గురువునే పిలవాలి. అది మర్చిపోకండని వెంకయ్య చమత్కరించారు. 

భాష, సంస్కృతి, రాజకీయ రంగాలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశమంటే మట్టి కాదు మనుషులే. పెద్దల్ని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, సర్వప్రాణులతో కలసి జీవించడం, ఉన్నది పదుగురితో పంచుకోవడం, తోటివారి పట్ల అక్కరచూపడం (షేర్‌ అండ్‌ కేర్‌) మన భారతీయ సంస్కృతికి మూలం. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా ఇదే మన సంస్కృతి. అంటే మన జీవనవిధానం.

ఇవాళ రాజకీయాల్లోనూ విలువలు దిగజారిపోయాయి. ఇవాళ సభ అంటే బస్‌, బిర్యానీ, బాటిల్‌ అనే 3 బీ ఫార్ములా అనుసరించి జనాన్ని తరలిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాలు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ల స్థాయి తగ్గిపోయి, ప్రజాప్రతినిధుల భాష పతనమవుతున్న ధోరణిని ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. నేను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషువాడికి వ్యతిరేకం.

మాతృభాషను పక్కనపెట్టేసి, పరాయిభాషను నెత్తినపెట్టుకొనే భావదారిద్య్రానికి వ్యతిరేకం. స్వాతంత్య్రానికి పూర్వం మన స్థూలజాతీయోత్పత్తి ప్రపంచంలో మూడోవంతు ఉండేది. కానీ, మనల్ని దోచుకువెళ్ళి, ఆనాడే అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసి ఎగుమతి చేసిన మనల్ని పనికిమాలిన, తెలివితక్కువవారనే అభిప్రాయంలో ఇవాళ్టికీ ఉంచేలా చేసిన పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకం.

సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్‌ వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, పారిశ్రామికవేత్తలు వి. రాజశేఖర్, రాజు, జేవీ కృష్ణప్రసాద్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఎందరో సినీప్రముఖుల గురించి రాసిన ఈ పుస్తకావిష్కరణను సినీపరిశ్రమ చేసి ఉండాల్సింది’ అని రమణాచారి అభిప్రాయపడ్డారు. బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ, ‘గతంలో దాదాపు ప్రతి సినిమాలో ప్రబోధాత్మక గీతం ఉండేది. ఒకప్పుడు దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్పవారున్నారు. ఇవాళ దేశాన్నే త్యాగం చేస్తున్న ప్రబుద్ధులు తయారయ్యారు. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి లాంటి ఒకరిద్దరి గురించే తెలుగులో సినిమాలొచ్చాయి.

స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగువారైన మరెందరో త్యాగధనుల గురించి సినిమాలు రావాలి’ అని అభిలషించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘వాస్తవాలను వక్రీకరించకుండా, చరిత్రను చెప్పే సినిమాలు రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా రమణాచారి ఇచ్చిన సలహా మేరకు ఎంతో శ్రమించి, ఈ పుస్తకం రాసినట్టు సంజయ్‌ కిశోర్‌ తెలిపారు. సురేఖామూర్తి, శ్రీమతి భూదేవి తదితర ప్రముఖ గాయనులు స్వాతంత్య్ర గీతాలాపన, అంబటిపూడి మురళీకృష్ణ వ్యాఖ్యానం సభను రక్తి కట్టించాయి. పలువురు సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top