వందేభారత్‌ సూపర్‌ సక్సెస్‌ 

Vande Bharat trains are super success - Sakshi

సికింద్రాబాద్‌– విశాఖ, తిరుపతి రెండూ కిక్కిరిసే.. 

విశాఖ సగటు ఆక్యుపెన్సీ రేషియో 128%, తిరుపతి 131% నమోదు 

దేశంలోనే టాప్‌ ప్లేస్‌లోకి రైళ్లు 

త్వరలో తిరుపతి సర్విసు కోచ్‌ల సంఖ్య రెట్టింపు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కొత్తగా పట్టాలెక్కిన రెండు వందేభారత్‌ రైళ్లూ సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. టికెట్‌ ధర ఎక్కువైనా ప్రయాణికులు వాటిల్లో వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీంతో సికింద్రాబాద్‌–విశాఖపట్నం, సికింద్రాబాద్‌–తిరుపతి రైళ్లు కిక్కిరిసి పరుగులు పెడుతున్నాయి.

సికింద్రాబాద్‌–తిరుపతి రైలు సగటు ఆక్యుపెన్సీ రేషియో 131 శాతం ఉండగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు 134 శాతం నమోదవుతోంది. సికింద్రాబాద్‌–విశాఖపట్నం వందేభారత్‌ సగటు ఆక్యుపెన్సీ రేషియో 128 శాతం ఉండగా, తిరుగు ప్రయాణంలో 106 శాతంగా నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పట్టాలెక్కిన వందేభారత్‌ రైళ్ల ఆక్యుపెన్సీలో ఇవే టాప్‌లో నిలవటం విశేషం.  

వేగమే ప్రధానం.. 
కాచిగూడ–తిరుపతి మధ్య 2017లో డబుల్‌ డెక్కర్‌ రైలును ప్రారంభించారు. అది మధ్యాహ్నం పూట ప్రయాణించేది కావటంతో బెర్తులకు బదులు చైర్‌కార్‌ మాత్రమే ఉంటుంది. దీంతో దానికి ఏమాత్రం ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 12 శాతానికి పడిపోయింది. ఫలితంగా దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దానిలాగే మధ్యాహ్నం వేళ, చైర్‌కార్‌తో ప్రయాణించే వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే అధికారులకు డబుల్‌ డెక్కర్‌ రైలే గుర్తొచ్చింది. దీంతో తిరుపతి వందేభారత్‌కు కేవలం 8 కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది.

అధిక ఛార్జీ, పగటి వేళ ప్రయాణం, బెర్తులు ఉండకపోయినప్పటికీ జనం ఎగబడుతున్నారు. విశాఖపట్నం వందేభారత్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఇందుకు వందేభారత్‌ వేగమే కారణమని స్పష్టమవుతోంది. విశాఖ, తిరుపతిలకు సాధారణ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడుతుంటే వందేభారత్‌ కేవలం 8 గంటల్లో గమ్యం చేరుస్తోంది. ఉదయం బయలుదేరితే మధ్యాహా్ననికల్లా గమ్యం చేరుతుండటంతో ప్రయాణికులకు ఒక పూట ఆదా అవుతోంది.

సికింద్రాబాద్‌–విశాఖ వందేభారత్‌లో.. విశాఖ వెళ్లేప్పుడు ఎక్కువ మంది ప్రయాణిస్తుండగా, సికింద్రాబాద్‌–తిరుపతి సర్వీసులో మాత్రం, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. తిరుపతిలో దర్శనాలు పూర్తి చేసుకున్నాక, మధ్యాహ్నం రైలెక్కి అదే రోజు రాత్రికల్లా నగరానికి చేరుకోగలుగుతుండటం వారికి కలిసి వస్తోంది.  

తిరుపతి రైలు ఆదాయం అదుర్స్‌ 
జనవరి 15న విశాఖ వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. కాగా ఏప్రిల్‌ 1 నుంచి ఏప్రిల్‌ 19 వరకు దాని ద్వారా రైల్వేకు రూ.31 లక్షల ఆదాయం నమోదైంది. అయితే తిరుపతి సర్విసులో 8 కోచ్‌లు మాత్రమే ఉన్నా, పది రోజుల్లో రూ.17.50 లక్షల ఆదాయం వచ్చింది. త్వరలో తిరుపతి రైలుకు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top