Telangana: ‘యునెస్కో’కు మరో 25 ప్రతిపాదనలు

Union Minister Kishan Reddy Said Another 25 Tourist Destinations UNESCO Recognition - Sakshi

రాష్ట్రం నుంచి పంపుతామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పురాతన రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించడం గర్వకారణంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల తరఫున రామప్పకు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో మరో 25 పర్యాటక ప్రాంతాలను యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపుతామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆయన గురువారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.

అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి సబ్సిడీతో అతి తక్కువ విమాన చార్జీలతో పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. 2016 నుంచి రామప్పకు యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని, అయితే అప్పుడు పలు దేశాలు తిరస్కరించాయన్నారు. ఆయా దేశాలతో విదేశాంగ శాఖ తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడి, వారు రామప్పకు అనుకూలంగా ఓటు వేసేలా చేశారని తెలిపారు. ఇందులోభాగంగా 17 దేశాలు రామప్పకు జై కొట్టాయన్నారు. తెలంగాణలో కాకతీయుల కట్టడాలు శిల్పకళా నైపుణ్యం పరిరక్షించుకోవాలని, నేటి యువతరానికి వాటి గురించి తెలియ చెప్పాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో సీఎం కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని చెప్పా రు. తర్వాత కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు వేయిస్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి నుంచి కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌ కోటకు వెళ్లారు. టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షోను వీక్షించారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top