Two Students Committed Suicide In RGUKT Of Nirmal District, Many Of These Deaths Remain A Mystery - Sakshi
Sakshi News home page

అక్కడ ఎందుకలా చనిపోతున్నారు?

Aug 10 2023 3:47 AM | Updated on Aug 10 2023 1:27 PM

Two students committed suicide in RGUKT in June - Sakshi

నిర్మల్‌:  విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలు నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో కలకలం రేపుతున్నాయి. ఇందులో చాలా మరణాలు మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. జూన్‌లోనే ఇద్దరు విద్యార్థి నులు తనువు చాలించగా, ఇటీవలే వర్సిటీలోకి అడుగుపెట్టిన కొత్త విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం కలచివేస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీలు వేసినా అసలు కారణాలు మాత్రం బయటకు రావడం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు హడావుడి చర్యలు తీసుకుంటూ ఆ తర్వాత చేతులు దులిపేస్తున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి ఒకప్పుడు 20 వేల నుంచి 30 వేల మధ్య దరఖాస్తులు వచ్చేవి. వరుస ఘటనలతో ఇప్పుడు 10 వేల నుంచి 12 వేల మధ్యకు దరఖాస్తులు పడిపోవడం గమనార్హం. 

బలవన్మరణాలు ఎందుకు? 
ఎంత ఒత్తిడి, ఎంత బాధ, భవిష్యత్తుపై ఎంత భయం కలిగి ఉంటే.. ఓ 17ఏళ్ల విద్యార్థి ని బాత్రూమ్‌లో.. అదీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌కు తన చున్నీతోనే ఉరేసుకుంటుంది..? జూన్‌ 13న సంగారెడ్డికి చెందిన వడ్ల దీపిక(17) ఇలానే ప్రాణాలు తీసుకుంది. ఆమె చనిపోయిన రోజే నలుగురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసినా.. ఇప్పటికీ కారణాలు బయటపెట్ట లేదు.

ఇక దీపిక మృతిచెంది రెండురోజులు కూడా గడవకముందే తనతోపాటే పీయూసీ–1 చదువుతున్న గజ్వేల్‌కు చెందిన బుర్ర లిఖిత జూన్‌ 15న అర్ధరాత్రి తర్వాత గంగా బ్లాక్‌ నాలుగో అంతస్తుపై నుంచి పడి చనిపోయింది. లిఖిత మరణంలోనూ ఏదో మిస్టరీ ఉందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. తాజాగా ఈ నెల 8న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మండలం నాగాపూర్‌కు చెందిన జాదవ్‌ బబ్లూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

కౌన్సెలింగ్‌ చేస్తున్నారా.. 
విద్యార్థుల మృతిపై ప్రతిపక్ష పా ర్టీలు, విద్యార్థి సంఘాలు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల బాసర సరస్వతీమాత ఆలయంలో హుండీ లెక్కించగా, అందులో తల్లిదండ్రులు రాసిన లేఖ బయటపడింది. విద్యార్థులకు  కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏకంగా ముగ్గురు కౌన్సిలర్‌లతో కూడిన డిపార్ట్‌మెంట్‌ ఉంది. అసలు ఆ విభాగం ఏం చేస్తోంది..  నూతన విద్యార్థులకు తరచూ కౌన్సెలింగ్‌ ఇవ్వడం లేదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక బాసర ఆర్జీయూకేటీలో సమస్యలు, మరణాలపైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఏం జరుగుతోంది.. 
అసలు.. బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. జూన్‌లో ఇద్దరు విద్యార్థినులు చనిపోయినప్పుడు నలుగురు సభ్యులతో వేసిన కమిటీ ఏం నివేదిక ఇచ్చిందో బయటకు రాలేదు.

ఇక కళాశాల విద్యార్థులు చనిపోతే ఆ మృతదేహాలను అనాథ శవాల్లా ఒకరిద్దరు సెక్యూరిటీ గార్డులతో మార్చురీకి తరలించేసి యాజమాన్యం దులిపేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు కొన ఊపిరితో ఉన్నప్పుడే ఆస్పత్రులకు పంపించామని చెబుతున్న అధికారులు, బాసరకు దగ్గరగా ఉన్న నిజామాబాద్‌కు పంపించాలి కానీ.. దూరంగా ఉన్న నిర్మల్‌కు ఎందుకు పంపిస్తున్నారన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement