తెగుళ్ల నష్టం.. అప్పుల కష్టం

Two Farmers Ends Life In Mahabubabad And Siddipet District - Sakshi

ఇద్దరు రైతుల ఆత్మహత్య  

మహబూబాబాద్‌ రూరల్‌/దౌల్తాబాద్‌ (దుబ్బాక): అప్పులు తీర్చేమార్గం కానరాక మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మానుకోట మండలం ఆమనగల్‌కు చెందిన దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి(40) మూడెకరాల్లో వరి, ఎకరం పత్తి, రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. పత్తి అంతంత మాత్రంగానే పండగా, మిర్చికి తెగుళ్లు ఆశించడంతో తీరని నష్టం వాటిల్లింది. పంటలసాగుకు చేసిన అప్పు, బ్యాంకు రుణాలు మొత్తం రూ.10 లక్షలకు చేరాయి.

అప్పులు తీర్చే మార్గం కానరాక తన వ్యవసాయ బావి వద్ద సోమవారం సాయంత్రం పురుగులమందు తాగాడు. సమీప రైతులు గమనించి 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం ఉప్పరపల్లికి చెందిన జంగపల్లి బాల్‌రాజు(28) హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాస్టర్‌. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి స్వగ్రామానికి వచ్చి తనకున్న ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ముగ్గురు అక్కలపెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉదయం గ్రామం సమీపంలోని సింగచెరువు వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top