ఇద్దరు మహిళలు గల్లంతు.. 13 మంది సురక్షితం 

Two Boats Sank In Indravati River, Two Women Were Missing - Sakshi

సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని ఇంద్రావతి నదిలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లోని అతుకుపల్లిలో ఓ శుభకార్యానికి పది మంది పురుషులు, ఐదుగురు మహిళలు నాటు పడవల్లో ఇంద్రావతి నది దాటి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చీకటి పడడంతో వరద ఉధృతిని అంచనా వేయలేక నది దాటే క్రమంలో రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా సోమన్‌పల్లి వాసులు 15 మంది నీటిలో కొట్టుకుపోయారు. కొంత మందికి ఈత రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: పడవ ప్రమాదంలో 32 మంది మృతి!

మిగతా వారు పెద్ద బండలను పట్టుకొని స్థానికులు వచ్చేవరకు ప్రాణాలు అరచేత పట్టుకుని గడిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు మంగళవారం రాత్రి నీటిలో చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే ఇద్దరు మహిళల ఆచూకీ మాత్రం లభించలేదు. బుధవారం ఉదయం అటవీ, పోలీసు శాఖ అధికారులు గల్లంతైన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. గల్లంతైన వారిని సోమన్‌పల్లికి చెందిన కాంత ఆలం, శాంత గావుడేలుగా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతం భూపా లపల్లి జిల్లా పలిమెల మండలానికి సమీపంలో ఉంటుంది.

మంజీరాలో చిక్కుకున్న నలుగురు
సాక్షి, మెదక్‌: చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు మంజీర నదిలో చిక్కుకోగా.. అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తిన విషయం తెలిసిందే. కాగా, పైనుంచి నీటి ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. ప్రవాహం తగ్గడంతో మెదక్‌ పట్టణానికి చెందిన ఆర్నే కైలాశ్, రాజబోయిన నాగయ్యతోపాటు కొల్చారం మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన దుంపల ఎల్ల, సాదుల యాదగిరి మంగళవారం పొద్దుపోయాక చేపలవేటకు అవసరమైన సామగ్రితో పాటు ఆహార పదార్థాలను తీసుకుని హనుమాన్‌ బండల్‌ వద్ద నది దాటారు. 

రాత్రంతా అక్కడే వలలు వేసి చేపల వేట కొనసాగిస్తూ నిద్రపోయారు. బుధవారం ఉదయం లేచే సరికి నదీ ప్రవాహం పెరగడంతో అక్కడి నుంచి అవతలి ఒడ్డుకు వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో వారు తమ బంధువులకు ఫోన్ల ద్వారా విషయం చెప్పగా, వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొల్చారం ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్‌ ప్రదీప్, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌ ఇన్‌చార్జి ఆర్డీఓ సాయిరాం సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉన్నతాధికారుల ఆదేశంతో సాయంత్రం మెదక్‌ మత్స్య సహకార సంఘానికి చెందిన గజ ఈతగాళ్లు అగి్నమాపక దళం సహకారంతో ఆవలి ఒడ్డుకు చేరుకుని అక్కడ చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రవాహ ఉధృతి దృష్ట్యా అటువైపు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరించారు. దీనికి సంబంధించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top