రెండు లక్షల మంది భవితకు పరీక్ష, స్పందించిన ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి

Ts Inter First Year Result 2021 Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు కొత్త వివాదాలు రేపుతున్నాయి. 2 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్‌ ఏంటనే ప్రశ్న తెరపైకొచ్చింది. పట్టణాల్లో ఫలితాలు మెరుగ్గా, గ్రామాల్లో తక్కువగా రావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్, సెకండియర్‌ పరీక్షలు ఎలా రాస్తారని, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సమయమెక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఫెయిలైన ప్రభావం రెండో ఏడాదిపైనా ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఫలితాలపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఇంటర్‌ బోర్డు తీరును దుయ్యబడుతూ శుక్రవారం బోర్డు కార్యాలయం వద్ద సంఘాల నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల నుంచీ బోర్డు తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంటర్‌ ఫస్టియర్‌లో 2,35,230 మంది ఫెయిలయ్యారు. వీరిలో రెండుకుపైగా సబ్జెక్టులు ఫెయిలైన వాళ్లు 63 శాతం మంది ఉన్నారు. ఆన్‌లైన్‌ బోధనకు అవకాశం లేక వీళ్లకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లే వాళ్లు వినే అవకాశం చిక్కలేదు. నెట్‌ సిగ్నల్స్‌ అందడం లేదని విద్యార్థుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు నవీన్‌ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌ జిల్లాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. 

గ్రేస్‌ మార్కులేస్తే?:
ఆన్‌లైన్‌ సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు చాలా చాప్టర్లు వినలేదని వరంగల్‌కు చెందిన అధ్యాపకుడు సతీశ్‌వర్మ తెలిపారు. ఇప్పుడీ చాప్టర్స్‌ మొదటి నుంచీ చదివితేనే మార్చిలోనైనా పరీక్షలు రాయగలరన్నారు. కానీ విద్యార్థులు ఇప్పటికే సెకండియర్‌ ప్రిపరేషన్‌లో ఉన్నారని మరి సమయం ఎలా ఉంటుందని అన్నారు. ‘గ్రేస్‌ మార్కులిస్తే కనీసం 30 శాతం మంది బయటపడే వీలుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్‌ నీలేశ్‌ చెప్పారు.   

అంతా సక్రమంగానే చేశాం, విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి  
ఫస్టియర్‌ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్‌ బోర్డ్‌ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్‌ మెటీరియల్‌ను కూడా బోర్డ్‌ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.  

రీ వెరిఫికేషన్‌ ఫీజును తగ్గిస్తున్నాం..:
ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్‌ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top