ఖమ్మం కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం

TS High Court Fire On Khammam Collector - Sakshi

ఎందుకు చర్యలు తీసుకోరాదంటూ నోటీసులు

10న కలెక్టర్‌ కోర్టుకు హాజరుకావాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఓ కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో సింగిల్‌ జడ్జి ముందుగా నిర్ణయించుకుని (ప్రీ డిటర్మైండ్‌) వచ్చి తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఆ తీర్పును కొట్టివేయాలంటూ ఖమ్మం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అప్పీల్‌ దాఖలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జికి ఉద్దేశాలను ఆపాదించడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడింది. న్యాయస్థానంలో దాఖలు చేసే పిటిషన్లలో సంతకాలు చేసే ముందు సంబంధిత అన్ని అంశాలను జాగ్రత్తగా చదువుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఈ తరహా వ్యాఖ్యలను అనుమతించమని, ప్రభుత్వ న్యాయవాదులు అప్రమత్తంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పిటిషన్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

అప్పీల్‌లో ఈ తరహా అంశాలను పేర్కొన్నందుకు వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్‌ కర్ణన్‌ సహా స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే సింగిల్‌ జడ్జిపై చేసిన వ్యాఖ్యల అంశాలను అప్పీల్‌ నుంచి తొలగించేందుకు అనుమతించాలంటూ అభ్యర్థించడంతో ఎ.సంజీవ్‌కుమార్‌కు ఇచ్చిన షోకాజ్‌ నోటీసును రీకాల్‌ చేసింది. కలెక్టర్‌ను మాత్రం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నిబంధనల కు విరుద్ధంగా కొందరు రైతులమని చెబుతూ గ్రామీణ వికాస బ్యాంక్‌ నుంచి రుణాలు పొందారంటూ ఖమ్మం జిల్లా పెనుబల్లికి చెందిన కర్రి వెంకట్రామయ్య గతంలో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి.. పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్‌ను 2019, డిసెంబర్‌ 11న ఆదేశించారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో వెంకట్రామయ్య గత ఏడాది సెప్టెంబర్‌లో కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత కలెక్టర్‌ స్పందించారని, హైకోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్‌కు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ రూ.500 జరిమానా విధించారు. ఈ డబ్బును కలెక్టర్‌ జీతం నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కర్ణన్‌ అప్పీల్‌ దాఖలు చేయగా ధర్మాసనం పైవిధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్‌ 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అని, కోర్టుల మీద గౌరవం కలిగిన అధికారిగా ఆదేశాలను అమలు చేస్తున్నారని సంజీవ్‌కుమార్‌ వివరించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం... ఈ నెల 10న కలెక్టర్‌ కర్ణన్‌ వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top