8 ఏళ్లు 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు  | Sakshi
Sakshi News home page

8 ఏళ్లు 3.30 లక్షల కోట్ల పెట్టుబడులు 

Published Tue, Jan 3 2023 12:50 AM

TS Attracted Rs 3. 30 Lakh Crore Investments Outsmarting Other Cities Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పారదర్శక పాలనతో గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటీ, అనుబంధ రంగాల పురోగతితోపాటు ఈ ఏడాదిలో చేపట్టబోయే కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలపై తన శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సులభతర, సత్వర పారిశ్రామిక అనుమతుల జారీ కోసం తీసుకొచ్చిన టీఎస్‌–ఐపాస్‌ విధానం కింద 2014 నుంచి 2022 నవంబర్‌ వరకు కేవలం ఐటీ, అనుబంధ రంగాల్లోనే ఏకంగా రూ. 3.3 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇవి కాకుండా మైనింగ్, రియల్‌ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంతోపాటు ఇతర రంగాల్లో వచ్చిన పెట్టుబడులన్నింటినీ కలిపితే ఈ విలువ మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ పెట్టుబడులతో ఇదే కాలానికి రాష్ట్రంలో 22.5 మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు. 

పెట్టుబడుల కోసం 14 ప్రాధాన్యతా రంగాలు 
తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ సూచించారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వ పాలసీలను రూపొందించడంతోపాటు అవసరమైన పారిశ్రామిక పార్కులు, మౌలికవసతుల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావించిందన్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో దాదాపు 14 రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించి పక్కా ప్రణాళికతో భారీ పెట్టుబడులను సాధించిందని కేటీఆర్‌ తెలిపారు. ఒక్కో రంగానికి ప్రత్యేకంగా అధికారిని నియమించడంతోపాటు ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు నిర్వహించినట్లు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఇక్కడి మౌలిక వసతుల గురించి వివరించడం వల్లే అనేక రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో లక్షలాది మందికి ఉపాధి లభించడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఎన్నో ఏళ్లుగా అగ్రస్థానంలో ఉన్న దేశంలోని ఇతర నగరాలను హైదరాబాద్‌ దాటిందని కేటీఆర్‌ చెప్పారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు.  

పూర్తి పెట్టుబడుల నివేదిక తయారు చేయండి పెట్టుబడుల సాధనకు కృషి చేసిన అధికారులను అభినందించిన కేటీఆర్‌... వివిధ రంగాల్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పూర్తి వివరాలతో కూడిన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీఎండీ వెంకట నరసింహారెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement