చలానా జాప్యం ప్రాణం తీసింది

Three Month Old Baby Passed Away In Yadadri Due To Old Challan - Sakshi

ఆస్పత్రికి వెళ్లే కారును చలానా పేరిట ఆపిన పోలీసులు

ప్రాణాపాయస్థితిలో చిన్నారి ఉన్నా కనికరించని వైనం 

అరగంట ఆలస్యం.. మృతిచెందిన శిశువు

జనగామ/యాదగిరిగుట్ట రూరల్‌: పాత చలానా చెల్లింపులో అరగంట ఆలస్యం మూడునెలల చిన్నారిని బలిగొంది. కారులో ప్రాణాపాయస్థితిలో ఉన్న బాబును చూసినా ఖాకీల మనసు కరగలేదు. చలానా డబ్బులు చెల్లించిన తర్వాతే వదిలేస్తామన్న పోలీసుల అమానవీయవైఖరి ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం జరిగింది.

జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు మూడునెలల క్రితం బాబు జన్మించాడు. కొద్దిరోజుల క్రితం సరస్వతి తన కొడుకును తీసుకుని ఇదే మండలం వెంకిర్యాలలోని తల్లిగారింటికి వచ్చింది. ఈ క్రమంలో చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

వెంటనే తల్లిదండ్రులు ఓ అద్దె కారును తీసుకుని బాబుతోసహా బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి సమీపంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేస్తూ ఆ కారును ఆపారు. కారుకు సంబంధించి వెయ్యి రూపాయల పెండింగ్‌ చలానా ఉన్నట్లు ఆన్‌లైన్‌లో గుర్తించారు. పోలీసులు వెంటనే డ్రైవర్‌ వద్ద ఉన్న ఒరిజినల్‌ లైసెన్స్‌ తీసుకుని, చలానా కట్టిన తర్వాత కారు తీసుకెళ్లాలని సూచించారు.  

ఆస్పత్రికి తీసుకెళ్తున్నామన్నా కనికరించలేదు
‘సారూ.. బాబును ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం.. ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు.. ప్లీజ్‌ వదిలి పెట్టండి’అని ఆ తల్లిదండ్రులు ఎంతసేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. కారు ఓనర్‌కు డ్రైవర్‌ ఫోన్‌ చేసి పోలీసులతో మాట్లాడించాడు. చలానా వెంటనే చెల్లిస్తానని అతడు వేడుకోవడంతో కారును వదిలిపెట్టారు. అప్పటికే అరగంట గడిచిపోయింది.

ఆ తర్వాత నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి బాబు చనిపోయాడని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన గారాల పట్టి ఇక లేడంటూ బోరున విలపించింది. ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఓ బాబు పుట్టిన రెండు నెలల తర్వాత చనిపోయాడు. రెండో కుమా రుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం మూలంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో ఊరు ఊరంతా కన్నీటిపర్యంతమైంది. కాగా, ఆస్పత్రికి ఎమర్జెన్సీగా వెళ్తున్నామని మాకు ఎవరూ చెప్పలేదని, వాహనం లోపల బాబు సీరియస్‌గా ఉన్నాడని తెలిస్తే తాము అలా చేయమని ట్రాఫిక్‌ సీఐ సైదయ్య అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top