ఉసురు తీసిన వర్షం: ముగ్గురు రైతుల బలవన్మరణం

Three Farmers Deceased In Telangana - Sakshi

అప్పులకు తోడు పంట నష్టం

పురుగుల మందు తాగి ముగ్గురు రైతుల బలవన్మరణం

మహిళా రైతు ఆత్మహత్యా యత్నం

చిట్యాల/ మొగుళ్లపల్లి/ నార్నూర్‌/ వేల్పూర్‌: వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న ముగ్గురు రైతుల్ని ఇటీవలి భారీ వర్షాలు బలి తీసుకున్నాయి. వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో, సాగుకు తీసుకొచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఆయా ఘటనలకు సంబంధించి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనవేని ఎల్లయ్య (62)కు 6 ఎకరాల వ్యవసాయ భూ మి ఉంది. దీనికి అదనం గా మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగుచేశాడు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మిర్చి, పత్తి చాలావరకు దెబ్బతింది. మిగ తా పంటకు తెగులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పంటసాగుకు తీసుకొచ్చిన రూ.8 లక్షల అప్పు ఎలా తీర్చాలంటూ కుటుంబసభ్యులతో తన బాధను పంచుకున్నాడు. ఈ క్రమం లో బుధవారం పంటచేను వద్ద పురుగుల మందు తా గాడు. ఎల్లయ్య అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించిన మరో రైతు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో ఎల్లయ్యను చిట్యాల సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రాధమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

8 ఎకరాల్లో పంట నష్టంతో.. 
ఇదే జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రా మానికి చెందిన పండుగ చిన్న రాజయ్య (60) తనకున్న మూడెకరాల భూమితో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఎకరం వరి, మూడెకరాలు పత్తి, నాలుగు ఎకరాలు మిర్చి సాగు చేశాడు. గత ఏడాది చేసిన అప్పుతో పాటు ఈసారి తెచ్చింది కలిపి రూ.12లక్షల వరకు అప్పు అయ్యింది. ఇటీవలి వరుస వర్షాలతో పంటలు మొత్తం దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రాజయ్య భార్య సరోజన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అప్పులు, చెల్లెలి పెళ్లిపై బెంగతో..  
ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల్‌కొండ గ్రామానికి చెందిన యువరైతు అడే శ్రీనివాస్‌ తన తండ్రి చనిపోవడంతో గ్రామ శివారులోని ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో పత్తి, ఎకరంలో కూరగాయలు సాగు చేశాడు. కొద్ది రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంట తెగుళ్ల బారిన పడి ఎర్రగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంట పాడవడంతో అప్పులు ఎలా తీర్చాలో, చెల్లెలి పెళ్లి ఎలా చేయాలో తెలియక మూడు రోజులుగా దిగులు చెందుతున్నాడు. బుధవారం ఉదయం పొలానికి వెళ్లిన శ్రీనివాస్‌ (35) అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.5 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు భార్య, కూతురు, తమ్ముడు, చెల్లెలు, తల్లి ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై తెలిపారు.

పంట కొట్టుకుపోవడం తట్టుకోలేక.. 
నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో వరదనీటిలో కొట్టుకుపోయిన మక్క, పసుపు పంటను చూసి తట్టుకోలేక కానూర్‌ నాగమణి అనే మహిళా రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పంట చేనులో తాగడానికి యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు రైతులు ఆమెను అడ్డుకున్నారు. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మంగళవారం పెద్దవాగుకు భారీ వరద వచ్చింది.

దీంతో కరకట్ట తెగిపోయి వరదంతా నాగమణితో పాటు మరో ఏడుగురు రైతుల పంటలను ముంచెత్తింది. నాగమణికి చెందిన ఎకరం పంట భూమి కోతకు గురై వాగులో కలిసిపోగా, మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న, పసుపు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బుధవారం దెబ్బతిన్న పంటలు చూసిన నాగమణి, ఆమె భర్త లక్ష్మణ్, ఇతర కుటుంబసభ్యులు బోరున విలపించారు. తీవ్ర ఆవేదనతో నాగమణి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా మిగతావారు అడ్డుకున్నారు. వాగులో కలిసిన తమ భూమికి బదులు ప్రభుత్వం భూమి ఇచ్చి ఆదుకోవాలని, నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని లక్ష్మణ్‌ కోరాడు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top