గజం రూ.6 వేలు.. ఈ సారైనా అమ్ముడుపోయేనా..!

Third installment Auction On Rajiv Swagruha Srivalli Township Lands  - Sakshi

నల్లగొండ: రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లి టౌన్‌షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు అధికారులు మూడు విడత వేలం నిర్వహిస్తున్నారు. గతంలో గజం ధర రూ.7 వేలు ఉండగా.. ఈ సారి ధర రూ.6 వేలకు తగ్గించారు. ఇప్పటికే ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. అయితే గత రెండు విడతల్లో ప్లాట్లు పెద్దగా అమ్ముడుపోకపోవడంతో.. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

తొలి విడతలో మెరుగు
నల్లగొండ జిల్లా కేంద్ర సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదురుగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని ఇండ్లు నిర్మించింది. కొన్ని ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వాటిని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తోంది. మార్చి 14 నుంచి 4 రోజులçపాటు మొదటి విడతలో 340 ప్లాట్లను వేలానికి పెట్టింది. అప్పట్లో ఓపెన్‌ ప్లాట్‌ ధర గజం రూ.10 వేలుగా నిర్ణయించడం, చుట్టుపక్కల వెంచర్‌లో రూ.5 వేలకు గజం దొరుకుతుండడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘రాజీవ్‌ స్వగృహ పాట్ల కొనుగోలుకు స్పందన కరువు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ధర తగ్గించాలని కలెక్టర్‌ ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపారు. దీంతో గజం ధరను రూ.7 వేలకు కుదించారు. మొదటి విడతలో 165 ప్లాట్లు అమ్ముడుపోగా.. రూ.31.79 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

అధికారులపై ఒత్తిడి..
జూన్‌లో 2వ విడత వేలం నిర్వహించారు. ప్లాట్లు అమ్మించేందుకు జిల్లా స్థాయి అధికారులపై రాష్ట్రస్థాయి అధికారుల ఒత్తిడి తెచ్చారు. దీంతో జిల్లాస్థాయిలో పెట్రోల్‌ బంక్‌లు, గ్యాస్‌ ఏజెన్సీలు, మిల్లర్లు, ఇతర ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన యజమానులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టులు చేసే వారితో అధికారులు సమావేశం నిర్వహించి ప్లాట్లు కొనాలని సూచించారు. ఒకొక్కరు 5, 6 ప్లాట్లను కొనుగోలు చేయాలని ఒత్తిడి కూడా తెచ్చారు. ఈలోపు కలెక్టర్‌ బదిలీ కావడంతో పెద్దగా స్పందన రాలేదు. కేవలం 20 వరకు ప్లాట్లు కొన్ని గృహాలను మాత్రమే అమ్మగలిగారు. 

తగ్గిన కనీస ధర
శ్రీవల్లీ టౌన్‌షిప్‌కు ప్లాట్ల విక్రయానికి ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు మూడో విడత వేలం నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ప్రీ బిడ్‌ సమావేశం కూడా నిర్వహించారు. ఓపెన్‌ప్లాట్లకు గజం రూ.6 వేలు, పాక్షికంగా నిర్మాణ గృహాల్లో.. నిర్మాణ దశను బట్టి రూ.6 వేల నుంచి రూ.10,500 వరకు ధర నిర్ణయించారు. వేలం పాల్గొన్నవారు రూ.10 వేల డీడీ చెల్లించి దరఖాస్తుతో ఒక్కరోజు ముందు కార్యాలయంలో సమర్పించి టోకెన్‌ తీసుకొని వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ధర తగ్గించిన నేపథ్యంలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు చర్చించుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top