హరహర మహాదేవ... రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు

Telangana Vemulawada Shivaratri Celebrations Held In Grand Way - Sakshi

రాజన్నను దర్శించుకున్న 3 లక్షల మంది భక్తులు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

టీటీడీ తరఫున వచ్చిన డిప్యూటీ ఈవో బృందం

అలరించిన శివార్చన.. ఆర్జిత సేవలు రద్దు

శివనామస్మరణతో మారుమోగిన జిల్లా శైవక్షేత్రాలు

వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాజన్న దర్శనానికి దాదాపు 3 లక్షల మంది వరకు వేములవాడకు తరలివచ్చారు. ఒక్కోభక్తుడి దర్శనానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. శివమాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 6 గంటల నుంచి నిరంతరం లఘు దర్శనాలకు అవకాశం కల్పించారు.

ఉదయం వేళలో మధ్య మధ్యలో దర్శనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆర్జిత సేవలు రద్దు చేశారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. లింగోద్భవ సమయంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఏర్పాట్లను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎసీపీ అఖిల్‌ మహాజన్, అడిషనల్‌ కలెక్టర్‌లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఏఎస్పీ చంద్రయ్య, తహసీల్దార్‌ రాజారెడ్డి పరిశీలించారు. 

రాజన్నకు వెంకన్న పట్టువస్త్రాలు 
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ బృందం సమర్పించారు. వీరికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ ప్రసాదాలు అందించి, సత్కరించారు. 

రూ.50 కోట్లతో అభివృద్ధి : 
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ, సిరిసిల్ల పట్టణాలను రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహాజన్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, అడిషనల్‌ కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్‌ స్వాగతం 
పలికారు. రాజన్న దర్శనం అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ వేములవాడపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రాష్ట్రంలోనే ఎములాడ రాజన్న ఆదాయంలో నంబర్‌ వన్‌గా నిలుస్తుందన్నారు. గుడి చెరువు, ధర్మ గుండంలను ఎల్లప్పుడు గోదావరి జలాలతో నింపుతామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థఫు మాధవి, కౌన్సిలర్లు ఉన్నారు. 

మార్మోగిన ఆలయాలు 
కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌ పట్టణంతో పాటు జిల్యావ్యాప్తంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కరీంనగర్‌ పాతబజారులోని శివాలయం, కమాన్‌ వద్ద రామేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులుతీరారు.

శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం వేకువజాము 3.30 గంటలు: స్థానికుల దర్శనాల అనంతరం నిరంతరం లఘు దర్శనాల కొనసాగింపు. 
శనివారం ఉదయం 7 గంటలు: టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. 
ఉదయం 8: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ దంపతులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి పట్టువస్త్రాలు సమర్పించారు. 
మధ్యాహ్నం 3.30: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజన్నను దర్శించుకున్నారు. 
సాయంత్రం 4: శివమాలధారులు రాజన్నను దర్శించుకున్నారు. 
సాయంత్రం 6: అద్దాల మండపంలో అనువంశిక అర్చకుల ఆధ్వర్యం లో సామూహిక మహాలింగార్చన. 
సాయంత్రం 6 నుంచి ..: రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో శివార్చన. 
రాత్రి 11.35 నుంచి ఉదయం 4 గంటలు: లింగోద్భవ సమయంలో రాజన్నకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం. 

సేవలు ఇలా..
రాజన్న మహాజాతరలో 2 వేల మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. 
650 మంది శానిటేషన్‌ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరయ్యారు. 
ఎంపీవోలు 80 మంది, మెడికల్‌ సిబ్బంది 300, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ 150, అంగన్‌వాడీలు 150, స్వచ్ఛంద సంస్థ సభ్యులు వెయ్యి మంది జాతరలో విధులు నిర్వహించారు. 
ఆలయ సిబ్బంది 850, సెస్‌ ఉద్యోగులు 90, ఎక్సైజ్‌ 75 మంది విధులకు హాజరయ్యారు. 
800 బస్సుల్లో భక్తులను వివిధ ప్రాంతాలకు చేరవేశారు. 
14 ఉచిత బస్సులు తిప్పాపూర్‌ నుంచి రాజన్న ఆలయానికి భక్తులను ఉచితంగా చేరవేశాయి.
చదవండి: ఊరూవాడా శివనామ స్మరణ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top