రామప్పలో గుప్తనిధుల వేట 

Telangana: Treasure Hunt In Ramappa - Sakshi

ఉప ఆలయాల్లో తవ్వకాలు జరుపుతున్న దుండగులు 

వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా లభించి తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడుతుంటే, మరోపక్క దుండగులు రామప్ప ఉప ఆలయాల్లో గుప్తనిధుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేట శివారులో రామప్ప ప్రధాన ఆలయంతోపాటు పది ఉప ఆలయాలు ఉన్నాయి.

వారం క్రితం రామప్ప ఆలయానికి పడమర దిశలో ఉన్న జామాయిల్‌ తోటలోని శివాలయం (ఉప ఆలయం) వద్ద గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపినట్లు సమాచారం. నెలరోజులుగా ఉప ఆలయాల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఒక ముఠా రాత్రివేళల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో సరస్సుకట్టపై ఉన్న ఉపఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి శివలింగాలను ధ్వంసం చేశారు. బోటింగ్‌ పాయింట్‌ వద్ద ఉన్న శివాలయంలో నంది మెడను ధ్వంసం చేశారు. 20 రోజుల క్రితం పాలంపేట నాగబ్రహ్మక్షేత్రం వద్ద తవ్వకాలు జరపగా, ఏమీ లభించకపోవడంతో దానిని పూడ్చివేసినట్లు తెలిసింది.

జామాయిల్‌ తోటలోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలు జరిపినట్లు అక్కడ ఉన్న పూజా సామగ్రిని పట్టి తెలుస్తోంది. తవ్వకాల్లో విగ్రహంతోపాటు బంగారం లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చినప్పటికీ రక్షణ కరువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలంపేట ఉప ఆలయాలకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, రాత్రివేళల్లో పోలీసులు భద్రతాచర్యలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top