
బషీరాబాద్‌లో పట్టపగలే తవ్వకాలు
ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పరారీలో ప్రధాన మాంత్రికుడు
హైదరాబాద్: పట్టణంలో పట్టపగలే గుప్త నిధుల తవ్వ కాలు కలకలం రేపాయి. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురు ప ట్టుబడగా ప్రధాన మాంత్రి కుడు పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్‌ఐ నుమాన్‌అలీ తెలిపి న ప్రకారం.. గ్రామానికి చెందిన యాగ ప్రశాంత్‌కు పాడుబడిన ఇల్లు ఉంది. 15 ఏళ్లుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇటీవల ఆ ఇంటి నుంచి రాత్రివేళ శబ్దాలు వస్తున్నాయని.. అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. ఈ విషయాన్ని ప్రశాంత్ క్యాద్గిరాకు చెందిన తన స్నేహితుడు పట్నం శ్రీనివాస్‌కు చెప్పాడు.
వీరిద్దరూ బషీరాబాద్‌కు చెందిన మోహిజ్, మహేశ్, శివకుమార్‌తో కలిసి గుప్తనిధుల వెలికితీతకు పథకం రచించారు. వారం క్రితం శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాంత్రికుడు మొల్లను కలిసి గుప్తనిధుల విషయం వివరించాడు. దీంతో సదరు మాంత్రికుడు సెప్టెంబర్ 9వ తేదీన ఆదివారం పౌర్ణమితో పాటు గ్రహణం ఉందని, అదే రోజు నిధులు వెలికితీస్తానని, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఆదివారం బషీరాబాద్‌కు వచ్చిన మాంత్రికుడు ఉదయం 10.30 గంటలకు పాడుబడిన ఇంటికి చేరుకున్నాడు.
ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. ఇంట్లో శబ్దాలు బయటకు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే మాంత్రికుడు అక్కడి నుంచి పరారవ్వగా తవ్వకాలు జరుపుతున్న ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్‌ను పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. సాయంత్రం తాండూరు రూరల్ సీఐ నగేశ్ తవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పరారైన వ్యక్తినే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.