టీపీసీసీ ’మేధో మథనం’

Telangana TPCC Workshop On June 1st And 2nd - Sakshi

వచ్చే నెల 1, 2 తేదీల్లో వర్క్‌షాప్‌ 

చింతన్‌ శిబిర్‌ తీర్మానాలకు ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ తరహాలోనే టీపీసీసీ కూడా ‘మేధో మథనం’కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం, పీఏసీ సభ్యులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో వర్క్‌షాప్‌ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘చింతన్‌ శిబిర్‌’లో చేసిన తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలుపుతారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

కుటుంబానికి ఓ టికెట్, పదవుల్లో యువకులకు పెద్దపీట, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం అంశాలపై ఈ వర్క్‌ షాప్‌లో చర్చించనున్నట్టు తెలిపాయి. కాగా, ఈ వర్క్‌షాప్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకావట్లేదని తెలుస్తోంది. అమెరికాలో జరగనున్న ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం అక్కడకు వెళ్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఈ సభల కోసం అమెరికాకు బయలుదేరనున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన లేకుండానే తొలిసారి రాష్ట్రస్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఈ వర్క్‌షాప్‌కు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తోపాటు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఏఐసీసీ సూచన మేరకు అన్ని రాష్ట్రాల పీసీసీల ఆధ్వర్యంలో ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించి ఉదయ్‌పూర్‌ తీర్మానాలకు ఆమోదం తెలిపే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ వర్క్‌షాప్‌ను గాంధీభవన్‌లో నిర్వహించాలా లేక వేరే ప్రదేశంలోనా అన్న దానిపై టీపీసీసీ నేతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top