
జూలై వరకు నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీకి రాష్ట్రం వినతి
ఇప్పటికే ఏపీ కోటాకు మించి జలాలు వాడుకుందని ఫిర్యాదు
ఇకపై సాగర్, శ్రీశైలం నుంచి నీటిని తీసుకోకుండా నిలువరించాలని డిమాండ్
శ్రీశైలం, సాగర్‌లో మిగిలిన నిల్వలు తమవేనని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో మిగిలి ఉన్న నిల్వల నుంచి వేసవి తాగునీటి అవసరాల కోసం జూలై నెలాఖరు వరకు 10.26 టీఎంసీలను కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 88 రోజులపాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 300 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ద్వారా 750 క్యూసెక్కులు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు కలుపుకుని మొత్తం 10.26 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
వేసవి తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ చేసేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, త్రిసభ్య కమిటీ కని్వనర్ డీఎం రాయిపూరే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్ హాజరయ్యారు. ఏపీ మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరైంది. కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డుకు ఏపీ లేఖ రాసినట్లు తెలిసింది. ఇకపై బోర్డు సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని ఏపీ కోరుతోంది.
కోటాకు మించి ఏపీ వాడుకుంది..
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్)కు ఎగువన ఉన్న 15 టీఎంసీల్లో ఆవిరి నష్టంగా 4.28 టీఎంసీలు పోగా కేవలం 10.81 టీఎంసీలే మిగులుతాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. అందులో తమకు 10.26 టీఎంసీలు కేటాయిస్తే ఇక 0.55 టీఎంసీలే మిగులుతాయన్నారు.
ఇప్పటికే ఏపీ కోటాకు మించి కృష్ణా జలాలను వాడుకుందని.. అందువల్ల ఆ రాష్ట్రం శ్రీశైలం నుంచి ముచ్చుమర్రి ద్వారా, నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని డిమాండ్ చేశారు. రెండు జలాశయాల్లో మిగిలిన నిల్వలు తమవేనని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నీళ్లు అవసరమో ఇండెంట్ సమరి్పంచాలని కమిటీ కనీ్వనర్ డీఎం రాయిపూరే సూచించారు.