Telangana: అప్పు 41 వేల కోట్లు! | Telangana State Government Debt More Than Rs 40, 000 | Sakshi
Sakshi News home page

Telangana: అప్పు 41 వేల కోట్లు!

Jan 18 2022 1:42 AM | Updated on Jan 18 2022 11:28 AM

Telangana State Government Debt More Than Rs 40, 000 - Sakshi

తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 40 వేల కోట్ల మార్కును దాటనుంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సర్కారు అప్పు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 40 వేల కోట్ల మార్కును దాటనుంది. గత డిసెంబర్‌ నాటికే రూ. 39 వేల కోట్ల రుణాలను తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం మరో రూ. 2 వేల కోట్లను సమీకరించేందుకు సిద్ధమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వారా రూ.2 వేల కోట్ల విలువైన బాండ్లను వేలం వేయనుంది. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన మొత్తం రూ.20,659 కోట్ల విలువైన బాండ్ల వేలానికి ఆర్బీఐ షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఈ షెడ్యూల్‌ మేరకు మంగళవారం జరిగే వేలంలో 12 సంవత్సరాల కాలపరిమితి గల రూ.2 వేల కోట్ల విలువైన రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఆర్థిక పరపతి మెండుగానే ఉన్న మన రాష్ట్ర బాండ్ల వేలం సులభంగా జరిగిపోతుందని, రూ.2 వేల కోట్ల సమీకరణ పెద్ద కష్టమేం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  

గత అక్టోబర్‌ నాటికి రూ. 28 వేల కోట్ల అప్పు 
కాగ్‌ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రూ. 28,349 కోట్లను ప్రభుత్వం బహిరంగ రుణాల ద్వారా సేకరించింది. నవంబర్, డిసెంబర్‌ నెలల్లో ఈ అప్పు రూ.39 వేల కోట్లకు చేరింది. ఇప్పుడు రూ.2 వేల కోట్ల బాండ్ల వేలంతో రూ.40 వేల కోట్ల మార్కు దాటనుంది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పక్కాగా అమలు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణకు రానున్న రెండు నెలల్లో మరో రూ.6 వేల కోట్ల వరకు రుణాన్ని సమీకరించే అవకాశముంది.

2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారమే రూ.47,500 కోట్లను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మేరకు మిగిలిన మొత్తాన్నీ రుణాల రూపంలో సమీకరించుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  

కరోనా ఎఫెక్ట్‌తో.. 
2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.31 వేల కోట్లకు పైగా మాత్రమే రుణంగా తీసుకోవాలని వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కరోనా మిగిల్చిన కష్టాల వల్ల భారీగా అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏడాది మొత్తం రూ.45 వేల కోట్లకు పైనే అప్పు చేయాల్సి వచ్చింది.

ఒక్క 2021 జనవరి నెలలోనే రూ. 6 వేల కోట్లు రుణాలను సర్కారు సమీకరించడంతో ఆ ఏడాది అప్పటివరకు రూ.37 వేల కోట్లుగా ఉన్న అప్పు రూ.43 వేల కోట్లు దాటింది. తర్వాతి రెండు నెలల్లో మరో రూ.2,500 కోట్లకు పైగా అప్పులు తీసుకోవడంతో ఆ ఏడాది అప్పులు రూ. 45 వేల కోట్లు దాటాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement