
ఎంపీటీసీ, జెడ్పీటీసీల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు
రాతపూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు
సమావేశాలు, ర్యాలీల నిర్వహణకూ అనుమతి తప్పనిసరి
కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలు
స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియే ఆగిపోవచ్చని స్పష్టికరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న మండల, జిల్లా పరిషత్ తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రకటన వెలువడిన రోజు నుంచి మూడురోజుల్లో నామినేషన్ల దాఖలు ముగియనుంది. ఇక ఉపసంహరణలు పూర్తయ్యాక పోటీలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయమే కేటాయించారు. ఈ కాలంలో వారు ఓటర్లకు అవగాహన కల్పన, ఎన్నికల ప్రచారానికి, కార్యకర్తలు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే పోలింగ్ ముగియడానికి నిర్ణయించిన సమయానికి 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
⇒ రాత పూర్వక అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడొద్దు..అదీ నిర్ణీత సమయం వరకే అనుమతి ఉంటుందని పేర్కొంది.
⇒ సమావేశాలు, ర్యాలీల నిర్వహణలో ఆయా ప్రదేశాలకు అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
⇒ అభ్యర్థులు ఉపయోగించే వాహనాల వివరాలు ముందుగానే కలెక్టర్లు, ఎన్నికల అధికారికి తెలియజేయాల్సిఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు మొదలైన వాటి ముద్రణపైనా ఆంక్షలున్నాయని, వీటి ముద్రణదారుల వివరాలు, అడ్రస్ వంటివి తప్పకుండా వాటిపై పేర్కొనాలని తెలిపింది.
⇒ ప్రచారం నిర్వహించేటప్పుడు నైతికతకు ప్రాధాన్యతనిస్తూ, స్నేహపూర్వక పోటీ వాతావరణాన్ని దెబ్బతీసేలా అభ్యర్థులు వ్యవహరించొద్దని సూచించింది.
⇒ ఎన్నికల సమయంలో ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు తావు లేకుండా అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలు వ్యవహరించాలని పేర్కొంది.
⇒ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల ప్రక్రియ ఆగిపోవచ్చు. ఓటర్లకు ఏ రకంగానూ లంచం ఇచ్చేందుకు, అనుచిత ప్రవర్తనతో ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం, దొంగ ఓట్లను ప్రోత్సహించేలా వ్యవహరించొద్దని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.
⇒ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏదైనా వాహనంలో పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచొద్దు.
⇒ ఎస్‌ఈసీ విధించిన అభ్యర్థుల వ్యయ పరిమితి మాత్రం పూర్వకాలం నాటిదే కొనసాగుతోంది. జెడ్పీటీసీగా పోటీచేసే వారి వ్యయ పరిమితి రూ.4 లక్షలుగా ఉంది.
విద్వేష భావాలు రెచ్చగొడితే అంతే...
ఎన్నికల లబ్ధి కోసం అభ్యర్థి లేదా అతడి అనుమతితో ఏజెంట్, ఇతరులు మతం, జాతి, కులం, వర్గం లేదా భాషా ప్రాతిపదికన ప్రజల మధ్య విభేదాల సృష్టి, వ్యక్తుల మధ్య విద్వేష పూరిత భావాలు లేదా దేశంలోని వివిధ తరగతుల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టడం వంటి వాటిని కూడా అవినీతి చర్యగానే పరిగణిస్తామని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. విద్వేషాలతో రెచ్చగొట్టిన వారు ఒకవేళ గెలిచినా సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల నేరంగా పరిగణిస్తే మూడేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష, జరిమానా రెండూ విధిస్తారు.
ఏదో ఒక నామినేషనే ఉంచుకోవాలి
ఆయా ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వేసి ఉంటే, అందులో ఏదో ఒకటి ఎంచుకొని మిగిలిన వాటిని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అభ్యర్థులు సమర్పించిన అన్ని నామినేషన్లు తిరస్కరణకు గురై ఎక్కడి నుంచైనా పోటీకి అనర్హులుగా మిగిలిపోతారు. ఉదాహరణకు రెండు చోట్ల ఎంపీటీసీగా లేదా రెండు చోట్ల జెడ్పీటీసీగా నామినేషన్లు వేసి విత్ డ్రా చేసుకోకపోతే అనర్హులు అవుతారు. ఒక చోట ఎంపీటీసీగా, మరో చోట జెడ్పీటీసీగా పోటీ చేసినా, ఆ నామినేషన్లు చెల్లుబాటు అవుతాయి.