జూలై అంతా ‘సెట్‌’ 

Telangana State Board Of Higher Education Finalises Entrance Exam Dates - Sakshi

వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు 

వివరాలతో త్వరలో నోటిఫికేషన్లు 

ఫీజుల పెంపు లేదన్న మండలి చైర్మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ప్రకటించారు. లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ తదితర పరీక్షలను జూలైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇతర పరీక్షలు రాయాల్సి వస్తే ఆయా సెట్ల తేదీల్లో మార్పులు ఉంటాయని చెప్పారు.

మండలి కార్యాలయంలో మంగళవారం వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌తో చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ ప్రవేశ పరీక్షకూ ఫీజులు పెంచడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఫీజులే వర్తిస్తాయని చెప్పారు. ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికే విడుదలైందని, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్ల నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.

సెట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్షలను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్‌ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి, ఇతర సెట్ల బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించామని చెప్పారు. కాగా జూలై 13న ఈసెట్, జూలై 14 నుంచి 20 మధ్య ఎంసెట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top