
వెంటనే విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు
రేవంత్‌రెడ్డిని కలిసిన వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి.. అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శితో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది.
ఈ బృందంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్.నాగరాజులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చాలాసేపు మాట్లాడారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క స్టేడియం మాత్రమే ఉందని, జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడల నిర్వహణకు ఉపయోగపడుతోందని, శిక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు.
వరంగల్ అన్ని వైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభా పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా క్రీడా సేవల విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం అవసరాలను తీర్చలేకపోతోందని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలను మంజూరు చేయడం ద్వారా ప్రత్యేక క్రీడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించొచ్చని, ఈ పాఠశాలు ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల ప్రభుత్వ భూమి ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో అందుబాటులో ఉందన్నారు.
వరంగల్‌కు చెందిన విద్యార్థులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో క్రికెట్ కోసం ప్రత్యేక స్టేడియం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. క్రీడా పాఠశాలతోపాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియాన్ని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో పాటు జిల్లా అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఆసక్తికర భేటీ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రి కొండా సురేఖ దంపతులకు విభేదాలు వచ్చిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్‌తో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో ఈ సమావేశంలో రాజకీయంగా ఏం చర్చ జరిగిందన్నది ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాలకు సర్దిచెప్పేందుకే రేవంత్ విడివిడిగా ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశమయ్యారని, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను కొంతకాలం పక్కనపెట్టేలా ఈ భేటీలో చర్చలు జరిగాయని తెలుస్తోంది.