2024లో దేశవ్యాప్తంగా సైబర్ కేసుల నమోదులో 17.9 శాతం పెరుగుదల
తెలంగాణలో అత్యధికంగా నమోదైన 27,230 సైబర్ కేసులు
మొత్తం అన్ని రకాల కేసుల నమోదులో మాత్రం 6 శాతం తగ్గుదల
జాతీయ నేర గణాంకాల సంస్థ 2024 నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్ / సాక్షి స్పెషల్ డెస్క్: దేశంలో సైబర్ నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 2024లో అన్ని రకాల నేరాలకు సంబంధించిన కేసుల్లో 6 శాతం తగ్గుదల నమోదైనప్పటికీ సైబర్ నేరాల సంఖ్య మాత్రం 2023తో పోలిస్తే 17.9 శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గురువారం విడుదల చేసిన 2024 నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2023లో 86,420 సైబర్ నేరాల కేసులు నమోదవగా 2024లో ఆ సంఖ్య 1,01,928కు పెరిగింది. అలాగే సైబర్ నేరాల నమోదులో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2024లో 27,230 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక (21,993 కేసులు), ఉత్తరప్రదేశ్ (11,073 కేసులు), మహారాష్ట్ర (9922 కేసులు) నిలిచాయి. దేశవ్యాప్తంగా 2024లో 51,24,205 కేసులకుగాను 35,21,488 కేసుల్లో పోలీసుల దర్యాప్తు పూర్తవగా వాటిలో 25,40,668 కేసుల్లో (72.1%) చార్జిషీట్ నమోదు సైతం పూర్తయింది.
మొత్తంగా 6 శాతం తగ్గిన నేరాలు...
దేశవ్యాప్తంగా 2024లో మొత్తం అన్ని రకాల నేరాలు కలిపి 58,85,867 నమోదవగా 2023లో మొత్తం కేసుల సంఖ్య 62,41,569గా నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో కేసుల నమోదు సంఖ్యలో ఆరు శాతం (3,55,702) తగ్గుదల నమోదైనట్లు నివేదిక తెలిపింది. 2023తో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం 2024లో గాయపరచడం అనే నేరానికి సంబంధించి కేసుల్లో తగ్గుదలేనని నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో అన్ని రకాల నేరాలకు సంబంధించి 2024లో మొత్తం 2,17,976 కేసులు నమోదవగా 2023లో 1,83,644 కేసులు, 2022లో 1,65,830 కేసులు నమోదయ్యాయి.
మహిళలపై నేరాల్లో గృహహింస కేసులే అధికం
⇒ మహిళలు, చిన్నారులపై నేరాల నమోదుకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే 2024లో మొత్తం 2,84,530 కేసులు నమోదయ్యాయి. వాటిలో ‘భర్త లేదా అతని బంధువుల క్రూరత్వం’కేసులు అత్యధికంగా 1,20,227గా నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో వాటి వాటానే 42.3 శాతం. ఆ తర్వాతి స్థానాల్లో మహిళలపై అసభ్య ప్రవర్తనతో దాడులు (48,303 కేసులు, 17.0శాతం), అత్యాచారం (29,536) కేసులు, 10.4శాతం) ఉన్నాయి.
⇒ రాష్ట్రవ్యాప్తంగా 2024లో 144 వరకట్న హత్యలు నమోదవగా 10,061 గృహహింస కేసులు నమోదయ్యాయి.
స్వల్పంగా తగ్గిన హత్య కేసులు...
⇒ 2024లో మొత్తంగా 27,049 హత్య కేసులు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2023తో పోలిస్తే హత్య కేసుల సంఖ్య (27,721)లో 2.4 శాతం స్వల్ప తగ్గుదల నమోదైనట్లు తెలిపింది. 2024లో నమోదైన హత్య కేసుల్లో వివాదాల కారణంగా జరిగినవి 9,607 కేసులు, వ్యక్తిగత కక్షలకు సంబంధించినవి 3,638 కేసులు, ఆస్తి కోసం జరిగినవి 1,460 కేసులు ఉన్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 1,040 హత్య కేసులు నమోదవగా 2023లో 954 హత్యలు జరిగినట్లు నివేదిక తెలిపింది.
15.4 శాతం తగ్గిన కిడ్నాప్, అపహరణ కేసులు...
2024లో దేశవ్యాప్తంగా మొత్తం 96,079 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఇది 2023తో (1,13,564 కేసులు) పోలిస్తే 15.4 శాతం తగ్గినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2024లో కిడ్నాప్‌లకు గురైన వారిలో మొత్తం 1,10,433 మందిని పోలీసులు తిరిగి గుర్తించారు. ఇందులో 1,10,087 మంది సజీవంగా లభించగా 346 మందిని మరణించాక గుర్తించారు. తెలంగాణలో 2024లో మొత్తం 3,372 కిడ్నాప్ కేసులు నమోదుకాగా 2023లో ఆ సంఖ్య 3,174గా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. 


