TS: 6 రోజులు.. రూ. 1,111 కోట్లు

Telangana: Record Breaking Liquor Sales On December 31 - Sakshi

ఏడాది చివర్లో భారీగా మద్యం అమ్మకాలు.. డిసెంబర్‌ 30న రూ.250 కోట్లపైమాటే.. 

గత ఏడాదితో పోలిస్తే చివరి నాలుగు రోజుల్లో రూ.174 కోట్లు ఎక్కువ 

డిసెంబర్‌లో రూ.3,376 కోట్ల మద్యం అమ్మకాల రికార్డు 

గత ఏడాది మొత్తంతో పోలిస్తే దాదాపు రూ.500 కోట్లు ఎక్కువ  

సాక్షి, హైదరాబాద్‌: మద్యం అమ్మకాలు ‘కొత్త’పుంతలు తొక్కాయి. లిక్కర్‌ షాప్‌లకు కొత్త జోష్‌ వచ్చింది. లెక్కకు మించిన కిక్కు వచ్చింది. చలి తీవ్రతతోపాటు కొత్త సంవత్సరం వస్తోందన్న ఉత్సాహంతో మందుబాబులు తెగ తాగేశారు. సంవత్సరం చివర్లో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2022 డిసెంబర్‌ చివరివారం రూ. 1,111.29 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోవడం గమనార్హం. చివరి ఆరురోజుల మద్యం అమ్మకాలు వెయ్యి కోట్ల మార్కును దాటాయి.

ఒక్క డిసెంబర్‌ 30న రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి రూ.250 కోట్లకుపైగా విలువైన మందు వైన్‌షాపులకు తరలివెళ్లిందంటే కొత్త ఏడాది ఆరంభాన్ని మందుబాబులు ఎలా పండుగ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్‌లో చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.775 కోట్లు దాటింది. డిసెంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటే 2021లో రూ.2,901 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2022 డిసెంబర్‌లో ఆ విలువ రూ.3,376 కోట్లు దాటింది.

అంటే గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.500 కోట్లు పెరిగిందన్నమాట. 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్‌ కేసులు, 2.45 కోట్ల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.18,868 కోట్లపైచిలుకు కాగా, 2022లో జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు రూ.34,352.75 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. 2020తో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. 2020లో రూ.16,254 కోట్లు అమ్ముడుపోయింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top