ఇంకా ఎదురుచూపులే! 

Telangana: Process Of Procuring Grains In The TS State Will Start Soon - Sakshi

రాష్ట్రంలో మొదలు కాని ధాన్యం కొనుగోళ్లు 

ప్రభుత్వం ఆమోదం తెలిపినా కొలిక్కిరాని అధికారుల కసరత్తు 

ఏర్పాట్లలోనే నిమగ్నమైన యంత్రాంగం 

మరో ఐదారు రోజులు సమయం పట్టే అవకాశం 

మొత్తం 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందనుకున్నా.. మొదలు కాలేదు. దీంతో రైతులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. వరికోతలు ప్రారంభమై పదిరోజులు కావడంతో కొను గోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆ మోదం తెలిపింది. కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని, రైతులకు ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించింది.

అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి మూడు రోజులు అవుతున్నా జిల్లాల్లో కొనుగోళ్లకు సం బంధించిన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తూ నే ఉన్నారు. సోమవారమే సమీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు మరో ఐదారు రోజుల సమయం పట్టేలా ఉంది. 

4 జిల్లాల నుంచే 40% కంటే ఎక్కువ దిగుబడి 
నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమై కల్లాలకు ధాన్యం పది రోజుల నుంచే వస్తుండటంతో, ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ యంత్రాంగం అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో 1.35 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అందులో 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 6,500కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 26 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్‌లో 9,63,652 మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డిలో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరో 11 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 40 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఈ నాలుగు జిల్లాల నుంచే రానుంది.  

పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి సేకరణ 
జిల్లాల్లో పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం చివరలో సేకరణను ప్రారంభించి వచ్చే నెల మొదటి వారం వరకు అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. సోమవారం నల్లగొండ, నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై అ«ధికారులు సమీక్షలు నిర్వహించారు.

నల్లగొండ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈ వారం చివరలో, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నెలాఖరులో ధాన్యం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది.  

6,545 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు 
గతేడాది తరహాలోనే ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గత సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా ఈ కేంద్రాలన్నింటి ద్వారా యధావిధిగా ధాన్యం సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.

ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్, సీఎంఓ అధి కారులు నర్సింగ్‌ రావు, భూపాల్‌ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top