వైరస్‌పై యుద్ధానికి మళ్లీ సన్నద్ధం

Telangana Police Department Awareness Programmes About Covid-19 - Sakshi

మానసిక పరివర్తన కలిగించడమే ధ్యేయంగా పోలీసుల ప్రణాళిక

ఈసారి సోషల్‌ మీడియా, ‘ఏఐ’సాంకేతికత వినియోగంపై దృష్టి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కట్టడిలో తనవంతు పాత్ర పోషించేందుకు రాష్ట్ర పోలీస్‌ విభాగం మరోసారి సన్నద్ధమవుతోంది. వైరస్‌ విజృంభించిన కొత్తలో, ప్రత్యేకించి లాక్‌డౌన్‌ కాలంలో పోలీసులు అనుసరించిన వ్యూహాలు, ప్రజలకు అందించిన సేవలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శీతాకాలంలో వైరస్‌ మరింత విజృంభించే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో ప్రజలకు చేదోడుగా ఉండే అంశంపై పోలీస్‌ విభాగం కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో అందించిన సేవల స్ఫూర్తితోనే ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని పోలీస్‌ బాస్‌ నిర్ణయించారని సమాచారం. ఈసారి వీలైనంత ఎక్కువగా సామాజిక మాధ్యమాలను, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.

అందరిచేత ‘కోవిడ్‌ ప్రతిజ్ఞ’
వైరస్‌ ప్రబలిన తొలినాళ్లలో దాని నియంత్రణే ధ్యేయంగా పోలీసుశాఖ పనిచేసింది. ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించేలా కఠినంగా వ్యవహరించారు. అవసరమైతే జరిమానాలు విధించి, కేసులు పెట్టారు. వైరస్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై నిర్వహించిన ప్రచారాలు సైతం అప్పట్లో చాలామందిని ఆలోచింపచేశాయి. అటు తరువాత అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. కాస్త నిర్లక్ష్యమూ చూపుతున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో చాలామటుకు భౌతికదూరం, మాస్కు ధరించడంపై దృష్టి సారించట్లేదు. అందుకే, ఈసారి కేసులు, జరిమానాలు కాకుండా.. మానసిక పరివర్తన కలిగిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల చేత కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రజలందరితోనూ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు వీలుగా సోషల్‌మీడియాను సమర్థంగా వాడాలని, జనసమూహాలు, ఉత్సవాల సమయంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలని డీజీపీ జిల్లా అధికారులకు సూచించారని సమాచారం.

పోలీస్‌ విభాగానికి తీరని నష్టం
లాక్‌డౌన్‌ సమయంలో కంటికి కనబడని శత్రువుతో పోరాడుతూ విధులు నిర్వహించడం పోలీసుశాఖకు కత్తి మీద సామే అయ్యింది. మహా నగరంలో ఆ సమయంలో విధులు నిర్వర్తించడం ఒకెత్తయితే, పల్లెల్లో మరింతగా మమేకమై సేవలందించారు. ప్రజలు వైరస్‌ బారినపడితే.. వారిని, వారి పక్కవారిని అప్రమత్తం చేయడంతో పాటు బాధితులను చికిత్సకు తరలించడం వంటి పనులు చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించిన పోలీసులకు కరోనా వైరస్‌ అనేక సవాళ్లను విసిరింది. ఈ క్రమంలో 5,700 మందికిపైగా పోలీసులు వైరస్‌ బారినపడ్డారు. అంటే డిపార్ట్‌మెంట్‌లోని దాదాపు 54 వేలమందిలో ప్రతీ పదిమందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. దాదాపు 50 మందికిపైగా పోలీసులు అమరులయ్యారు. కేవలం ఏడు నెలల్లో ఈ స్థాయిలో సిబ్బందిని కోల్పోవడం పోలీసుశాఖ చరిత్రలో ఇదే తొలిసారి. ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు ప్రతీ నాలుగు రోజులకు ఒక పోలీస్‌ కోవిడ్‌ విధుల్లో అమరులయ్యారు. కరోనా బారినపడ్డ అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల్లో పోలీసులే పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైరస్‌పై మలిదశ సమరానికి పోలీసులు మళ్లీ సన్నద్ధమవుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top