నిర్లక్ష్యం.. బతుకులు బుగ్గిపాలు.. నగరంలో ‘రూబీ’ లాంటివెన్నో?

Telangana: No Safety Measures At Secunderabad Ruby Lodge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన.. నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని లేవనెత్తుతోంది. ఇప్పటికే ఈ భవనం ఓనర్ రంజిత్ సింగ్ బగ్గాను నార్త్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. రూబీ లాడ్జి బిల్డింగ్‌ అనుమతులపైనే ఇప్పుడు ప్రముఖ చర్చ నడుస్తోంది.

తక్కువ స్పేస్‌లో అంత బిల్డింగ్‌ ఇరుక్కుగా కట్టడం, వాటికి అనుమతులు ఎలా దక్కాయన్న కోణంలోనూ ఘటనస్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఫైర్ ఎన్‌ఓసీ(నో అబ్జక్షన్‌సర్టిఫికెట్‌)పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండు అంతస్తుల వరకే జీహెచ్ఎంసీ నుంచి ఫైర్ ఎన్ఓసీ తీసుకున్న రూబీ లాడ్జి.. మిగిలిన రెండు ఫ్లోర్లకు ఎలాంటి ఫైర్ అనుమతులు తీసుకోలేదన్నది సమాచారం. పైగా ఒకే భవనంలో.. పైన లాడ్జీ, కింద ఈ-బైక్‌ షోరూం, సెల్లార్‌లో ఈ-బైక్స్‌ నిర్వాహణ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న కోణంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు.. లాడ్జీ సెల్లార్‌లో  గ్యాస్ సిలిండర్లు సైతం నిల్వ చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక లాడ్జికి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గం కావడంతో అప్పటికే పొగలో చిక్కుకున్న వాళ్లకు ఇబ్బందికరంగా మారిందని అధికారులు గుర్తించారు. జంట నగరాల్లో ఈ తరహా కాంప్లెక్స్‌లు వందల్లో ఉండొచ్చని వాదన బలంగా వినిపిస్తోంది. కమర్షియల్ కాంప్లెక్స్ అయినప్పటికీ అగ్ని ప్రమాద నివారణ చర్యలు లేకపోవడం ఒక ఎత్తైతే.. నిరంతరం తనిఖీలు చేయని అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు చెలరేగుతున్నాయి.

భవనం పద్దెనిమిది మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటేనే ఫైర్ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోకి వస్తుందని ఫైర్ డిజి సంజయ్ జైన్ చెప్పడం మరోవైపు జీహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్‌మెంట్‌ల మధ్య సమన్వయ లోపం ఉండడం..  పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వెరసి.. నిర్లక్ష్యం కారణంగానే ఎనిమిది ప్రాణాలు బుగ్గి అయ్యాయన్నది చేదు వాస్తవం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. ముందు ముందు అనుమతుల విషయంలో కఠినంగా ఉండాలని, ఇప్పటికే ఉన్న ఇలాంటి భవనాలపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

ఆ ఇద్దరు ఫోన్‌లో ఉండగా.. 

పని నిమిత్తం వచ్చిన ఇద్దరు ఆచి మసాలా ఉద్యోగులు రూబీ ప్రమాదంలో మరణించడం బాధాకరం. కంపెనీలో ఆడిటర్‌ అయిన సీతారామన్, మార్కెటింగ్ ఉద్యోగి అయిన బాలాజీ.. నిన్న(సోమవారం) రూబీ లాడ్జ్ లో దిగారు. సీతారామన్ వాళ్ల బ్రదర్ తో ఫోన్‌లో మాట్లాడిన పది నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. ఇక బాలాజీ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కుటుంబ సభ్యులకు కాల్ చేసి హెల్ప్, హెల్ప్ అంటూ కేకలు వేశారు. అయితే.. ఆ పొగలోనే ఆయన ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ఆందోళనతో కుటుంబ సభ్యులు రూబీ రిసెప్షన్‌కు కాల్ చేయగా.. అప్పటికే ఆయన చనియారు. 

ఇదీ చదవండి: రూబీ లాడ్జి.. బిడ్డ పుట్టిన ఆనందం ఆవిరి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top