మృత్యుపాశమైన ఈవీ ఛార్జింగ్.. ఆరుగురు సజీవ దహనం! | 6 Burnt Alive Short Circuit During Electric Car Charging | Sakshi
Sakshi News home page

మృత్యుపాశమైన ఈవీ ఛార్జింగ్.. ఆరుగురు సజీవ దహనం!

Mar 18 2026 9:33 AM | Updated on Mar 18 2026 9:43 AM

6 Burnt Alive Short Circuit During Electric Car Charging

ఇండోర్: అది బుధవారం(నేడు) తెల్లవారుజామున 4 గంటల సమయం. ఆ ఇల్లంతా బంధువుల సందడితో కళకళలాడుతోంది. అయితే ఆ ఇంటి వెలుపల ఛార్జింగ్ పెట్టిన ఒక ఎలక్ట్రిక్ కారు వారి పాలిట మృత్యుపాశమైంది. చిన్న షార్ట్ సర్క్యూట్‌తో మొదలైన మంటలు.. గ్యాస్ సిలిండర్ల పేలుళ్లకు దారితీసి, ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బెంగాలీ స్క్వేర్ సమీపంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వ్యాపారి మనోజ్ పుగాలియా తన ఎలక్ట్రిక్ కారును ఇంటి బయట ఛార్జింగ్‌కు పెట్టారు. తెల్లవారుజామున ఛార్జింగ్ పాయింట్ వద్ద ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు చూస్తుండగానే, మూడు అంతస్తుల  ఇంటి అంతటికీ వ్యాపించాయి.
 

పేలిన గ్యాస్ సిలిండర్లు.. కుప్పకూలిన ఇల్లు
ఇంట్లో సుమారు 15 గ్యాస్ సిలిండర్లు ఉండగా, మంటల ధాటికి అందులో నాలుగు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలాయి. ఈ పేలుళ్ల తీవ్రతకు ఇంటిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో, ఇంట్లో నిల్వ ఉంచిన రసాయనాలు మంటలను మరింతగా వ్యాపింపజేశాయి. వీటి తీవ్రతకు లోపల ఉన్నవారు బయటపడే అవకాశం లేకుండా పోయింది.

పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారు. మంటలు వ్యాపించగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులు లోపలే చిక్కుకుపోవడంతో, రెస్క్యూ టీమ్ తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులను విజయ్ సేథియా (65), చోటూ సేథియా (22), సుమన్ (60), మనోజ్ (65), సిమ్రాన్ (30), రాశి సేథియా (12)గా పోలీసులు గుర్తించారు.మనోజ్ పుగాలియా ఇంట్లో జరుగుతున్న వేడుక కోసం వచ్చిన బంధువులు ఇలా విగతజీవులుగా మారడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెల్లారుతూనే ఘోరం.. ముగ్గురు మెడికోలు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement