
43,400 మంది జాబితా విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నిర్వహించిన నీట్–యూజీ పరీక్షలో రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 43,400 మంది జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. అయితే ఈ జాబితా కేవలం నీట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాల కోసం మాత్రమేనని.. మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. పూర్తి ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులు (ఎన్‌సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో–ఇండియన్, ఎస్‌సీసీఎల్) మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని వర్సిటీ రిజి్రస్టార్ పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా పరీక్ష నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.
ఈనెల చివరి వారంలో ఎంసీసీ కౌన్సెలింగ్?
నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు చెందిన మెరిట్ జాబితాను ప్రకటించిన తరువాత ముందుగా జాతీయ స్థాయిలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈనెల చివరి వారంలో ప్రారంభమవుతుంది. నేషనల్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక రాష్ట్రంలో అభ్యర్థులు ఇచ్చే వెబ్ ఆప్షన్ల ఆధారంగా ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని వర్సిటీకి చెందిన ఓ కీలక అధికారి తెలిపారు.